– ఆమెతోనే కేసీఆర్‌కు మచ్చ
– కేసీఆర్ కూతురుగా గౌరవం నిలబెట్టుకోలేదు
– పార్టీ పెట్టిన వారెవరూ బాగుపడలేదు
– కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
– కవిత సస్పెన్షన్‌పై బీఆర్‌ఎస్ మహిళా నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు బీఆర్‌ఎస్ మహిళా నేతలు పలువురు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడారు. కవితకు నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదనీ, కవితతోనే కేసీఆర్‌కు మచ్చ వచ్చిందనీ, కేసీఆర్ కూతురుగా ఆమెకు ఎక్కడికెళ్లినా లభించిన గౌరవాన్ని ఆమె నిలబెట్టుకోలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి బయటికెళ్లి పార్టీ పెట్టిన ఎవరూ బాగుపడలేదని తెలిపారు. కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు.
సత్యవతి రాథోఢ్ మాట్లాడుతూ కవిత బీఆర్‌ఎస్ శ్రేణులను తన మాటలతో బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేగుబంధం కన్నా కోట్లాది ప్రజలే ముఖ్యమని కేసీఆర్ నిరూపించారని తెలిపారు. పార్టీ తర్వాతే ఎవరైనా అని కేసీఆర్ సందేశమిచ్చారన్నారు. హరీశ్ రావు, కేటీఆర్‌లు కేసీఆర్‌కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్న సమయంలో కవిత పార్టీని ఇబ్బంది పెట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ ప్రజలు ఆమోదించేలా కవిత వ్యవహారం లేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎంత ఆగ్రహం ఉందో కవితకు తెలుసా? అని ప్రశ్నించారు. కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరో కాలుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత కుటుంబం కన్నా పార్టీయే ముఖ్యమని కేసీఆర్ మరోసారి నిరూపించారని తెలిపారు. ఈ సమావేశంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ రజని సాయిచంద్, బీఆర్‌ఎస్ నేతలు సుశీలా రెడ్డి, సత్యవతి, చారులత, నిరోషా తదితరులు పాల్గొన్నారు.
నచ్చజెప్పినా వినలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES