ఉమ్మడి బాధ్యత అనేది ఆచరణ కోసం పిలుపు
రైల్వే నిఘా అవగాహనా
వారోత్సవాల్లో కె.పద్మనాభయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రతి వ్యక్తి స్వీయ విజిలెన్స్ అధికారిగా ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా చైర్మెన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.పద్మనాభయ్య సూచించారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సోమవారం నుంచి నవంబర్ 2 వరకు నిఘా అవగాహనా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదికి నిఘా-మన ఉమ్మడి బాధ్యత అనే అంశంపై నిర్వహిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు-2025 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మనాభయ్య, గౌరవ అతిథిగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ హాజరయ్యారు. వారు 58వ ఎడిషన్ విజిలెన్స్ బులెటిన్ అనిమిషను విడుదల చేశారు. దీనిని దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా పద్మనాభయ్య మాట్లాడుతూ దేశానికి రైల్వే, రక్షణశాఖలు మూలస్థంభాలనీ, అవి దేశాన్ని అనుసంధానిస్తున్నాయని తెలిపారు. సంస్కృతులను మమేకం చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయని చెప్పారు. విజిలెన్స్ – మన ఉమ్మడి బాధ్యత అనేది కేవలం నినాదం కాదనీ, ఆచరణ కోసం పిలుపని ఆయన చెప్పారు. విజిలెన్స్ విభాగం పనితీరు, సుపరిపాలన, చట్ట నియమాలు, పారదర్శకత, పౌర కేంద్రీకృత, భాగస్వామ్య విధానం తదితర అంశాలను ఆయన వివరించారు. విజిలెన్స్ విభాగం రోజువారీ పనిలో ఈ సూత్రాలను వర్తింపజేస్తే కేసులు తగ్గుతాయని ఆయన సూచించారు. సైబర్ మోసాలు పెరగకుండా, అలాంటి కేసులను నివారించేందుకు అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.
సత్యప్రకాష్ మాట్లాడుతూ విజిలెన్స్-ఉమ్మడి బాధ్యత అనేది భారతీయ రైల్వేలకే కాకుండా మొత్తం సమాజానికి అవసరమని తెలిపారు. విజిలెన్స్ అనేది ప్రతి వ్యక్తి తన చర్యలు, నిర్ణయాలు, సమగ్రత ద్వారా సమర్థించాల్సిన సమిష్టి బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రతి రోజు సజావుగా కార్యకలాపాలు నిర్వహించే దక్షిణ మధ్య రైల్వేలో సమగ్రతలో చిన్న లోపం కూడా భద్రత, వినియోగదారుని విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయని వివరించారు. అందువల్ల నిజాయితీని ప్రోత్సహించే, పారదర్శకతను పాటించే, నైతిక ప్రవర్తనను ప్రశంసించే వాతావరణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సంతోషకరమైన, న్యాయమైన సమాజం కోసం నిజాయితీ, సమగ్రత ఎంతో అవసరమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అవినీతి దుష్ప్రభావాలపై, విజిలెన్స్ అవగాహన వారం సందేశాన్ని వ్యాప్తి చేసే స్కిట్‌ను ప్రదర్శించారు. ఔట్రీచ్ కార్యకలాపాల్లో భాగంగా, రైల్వే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సీవీసీ ఇచ్చిన ఇతివృత్తంపై ఇంగ్లీష్, హిందీ వ్యాసరచన, పోస్టర్ పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ప్రతి వ్యక్తి స్వీయ విజిలెన్స్ అధికారిగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



