No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఅంతర్జాతీయంప్రతి ఓటరుకూ ఐడీ ఉండాల్సిందే

ప్రతి ఓటరుకూ ఐడీ ఉండాల్సిందే

- Advertisement -

దీనిపై ఆదేశాలిస్తా : ట్రంప్‌
భారత్‌పై మీరూ ఆంక్షలు విధించండి : యూరప్‌ నేతలకు అమెరికా సలహా
వాషింగ్టన్‌ :
అమెరికా ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమయ్యారు. 2020 ఎన్నికలలో తాను పరాజయం పొందడానికి ప్రస్తుత వ్యవస్థే కారణమని ఆయన నిందించారు. ప్రతి ఓటరకూ గుర్తింపు కార్డు తప్పనిసరి చేస్తూ తాను త్వరలోనే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు.
ఓటర్‌ ఐడీ తప్పనిసరి. దీనికి మినహాయింపులేవీ ఉండవు. ఆ దిశగా కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేస్తా’ అని ఆయన ఆదివారం తన ట్రూత్‌ సోషల్‌ వేదికలో తెలియజేశారు. ఇకపై ఓటింగ్‌లో మెయిల్‌ విధానమనేదే ఉండదని, తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, సైన్యంలో పని చేస్తూ దూరంగా ఉన్న వారికి మాత్రమే ఆ వెసులుబాటు ఉంటుందని చెప్పారు. 2020 అధ్యక్ష ఎన్నికలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం వల్లనే తాను జో బైడెన్‌ చేతిలో ఓడిపోయానన్నది ట్రంప్‌ ఆరోపణ. అమెరికా పౌరులు కాని వారు భారీగా ఓటు వేశారని ట్రంప్‌, ఆయన రిపబ్లికన్‌ భాగస్వాములు అప్పుడు ఆరోపణలు చేశారు. ఈవీఎంల వినియోగాన్ని కూడా ట్రంప్‌ చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. వాటికి బదులు పేపర్‌ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓట్లను లెక్కించాలని కోరుతున్నారు. ఫెడరల్‌ ఎన్నికలలో ఓటేయాలంటే పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలు చూపాలని మార్చిలో జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలలో ట్రంప్‌ స్పష్టం చేశారు. ఎన్నికల తేదీ నాటికి బ్యాలెట్లన్నీ చేరుకోవాల్సిందేనని ఆయన ఆ ఆదేశాలలో తెలిపారు. అయితే ఈ ఆదేశాలలో ఒక భాగాన్ని ఏప్రిల్‌లో న్యాయమూర్తి నిలిపివేశారు. పౌరసత్వ నిరూపణ పత్రం చూపాలన్న నిబంధన కూడా అందులో ఉంది.

వచ్చే సంవత్సరం అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికలలో ఈ మెయిల్‌ బ్యాలెట్లు, ఓటింగ్‌ యంత్రాల వినియోగానికి స్వస్తి చెప్పేలా ఆదేశాలు జారీ చేస్తానని కూడా ట్రంప్‌ తెలిపారు. 2026 నవంబర్‌ 3న జరిగే మధ్యంతర ఎన్నికలు ట్రంప్‌ విధానాలపై రిఫరెండంగా భావిస్తున్నారు. ప్రతినిధి సభలోనూ, సెనెట్‌లోనూ ప్రస్తుతం రిపబ్లికన్లకు ఉన్న ఆధిక్యానికి గండి కొట్టాలని ప్రతిపక్ష డెమొక్రాట్లు పట్టుదలతో ఉన్నారు.

భారత్‌పై మీరూ ఆంక్షలు విధించండి : యూరప్‌ నేతలకు అమెరికా సలహా
తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందని ఓ సామెత ఉంది. అది అమెరికాకు అక్షరాలా వర్తిస్తుంది. భారత్‌పై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఇప్పుడు యూరోపియన్‌ దేశాలు కూడా తన బాటలోనే నడవాలని సూచిస్తోంది. భారత్‌ నుంచి చమురు, సహజ వాయువు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయాలని సలహా ఇస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపని పక్షంలో భారత్‌పై ఆంక్షలు విధిస్తానని తాను హెచ్చరించానని, అదే విధంగా యూరప్‌ కూడా ఆ దేశంపై సెకండరీ టారిఫ్‌ విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం కోరుతోంది. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నందున తనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యాభై శాతం సుంకాన్ని విధించడం పట్ల భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్నది చైనాయేనని, యూరప్‌ కూడా రష్యా నుంచి నిరంతరాయంగా ఇంధన ఉత్పత్తులు కొంటోందని గుర్తు చేసింది. కానీ చైనా, యూరప్‌ దేశాలు ట్రంప్‌ సుంకాల నుంచి తప్పించుకున్నాయని తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను కొందరు యూరోపియన్‌ నేతలు సమర్ధిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం ద్వారా భారత్‌ లాభాలు పొందుతోందని, ఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయంలో అనేక యూరోపియన్‌ దేశాలు మౌనం వహిస్తున్నాయి. ట్రంప్‌ సుంకాలను సమర్ధించడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయడం లేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad