మైలేజీ కోసం రాజకీయపార్టీల కసరత్తు
ఆర్డినెన్స్ రాకముందే హడావిడి
‘స్థానికం’లో క్రెడిట్ కోసం నానా అవస్థలు
బీసీ ముస్లింలపై విషం కక్కుతున్న బీజేపీ
చోద్యం చూస్తూ కాలయాపన చేస్తున్న కేంద్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశంలో క్రెడిట్ కొట్టేసేందుకు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లులు తెలంగాణ అసెంబ్లీ అమోదం పొందినప్పటికీ.. ఈ ప్రక్రియ పట్టాలెక్కాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ చట్టసవరణ చేసి, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి. ఆరంభం నుంచి దీనికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుతగులుతూనే ఉంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించింది. దానిలో భాగంగా ముసాయిదా బిల్లును గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. దానిపై రాజముద్ర పడక ముందే రాజకీయ పార్టీలు, తెలంగాణ జాగృతి వంటి కొన్ని సంఘాలు వీధికెక్కాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను ఏడాది క్రితం ప్రారంభించింది. కులగణన సర్వేతో పాటు, బీసీ కమిషన్‌ను నియమించి రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు చేసింది. మార్చి 18న శాసనసభలో రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ వెనుకబడిన తరగతులు (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్)-2025, తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు. (విద్యా సంస్థల్లో సీట్లు, రాష్ట్ర సంస్థల్లో ఉద్యోగ నియామకాలు, పోస్టుల రిజర్వేషన్) బిల్లులను అసెంబ్లీ అమోదించింది. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థల నిర్వహణ అనివార్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్ద పెండింగ్‌లో ఉంది.
పొలిటికల్ హైప్…
ఈ బిల్లు క్రెడిట్‌ను దక్కించుకొనేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు తెలంగాణ జాగృతి వంటి సంఘాలు నానా తంటాలు పడుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తాము బీసీలకు న్యాయం చేస్తూ, రిజర్వేషన్లు కల్పించామనీ, విపక్షాలు అడ్డంకులు సృష్టించినా కులగణన పూర్తిచేసి, దాని ఆధారంగా పక్కాగా పని పూర్తిచేశామని కాంగ్రెస్ చెప్తోంది. ఈ విషయంలో బీఆర్‌ఎస్ అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఆపార్టీ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రస్తావనే తేలేదు. రాజకీయంగా నిలబడా లంటే, గతం గుర్తుకు రాకుండా ఏదో రూపంలో అధికారపార్టీని డామినేట్ చేయాలనే తపన ఆపార్టీ నేతల స్టేట్‌మెంట్లలో కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లు అమలైతే తమ పోరాటఫలితమేననీ, కాకుంటే కాంగ్రెస్ వైఫల్యం అని ప్రచారం చేయాలని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఇక బీజేపీ తన మతోన్మాద విపరీత వాదనను ఈ రిజర్వేషన్ల అంశంలోనూ వెల్లడిస్తోంది. బీసీ బిల్లులో ముస్లింలను తప్పిస్తే, కేంద్రం నుంచి అనుమతి ఇప్పిస్తామనే కుంచిత స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ మాటల్ని బండి సంజరు వంటి కేంద్ర మంత్రులు అనడం గమనార్హం. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అసలు ఈ విజయం తమ పోరాట ఫలితమేనంటూ స్వీయ ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడులూ జరిగాయి.
9వ షెడ్యూల్‌లో చేర్చితేనే….
ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు 29, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6… మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ప్రతిపాదిత బిల్లుల ప్రకారం రిజర్వేషన్లు 63 శాతానికి పెరుగుతాయి, ఇది సుప్రీంకోర్టు మార్గ దర్శకాలకు విరుద్దం. అన్ని వర్గాలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతిపాదిత 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుల్ని గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి, చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. 9వ షెడ్యూల్ కొన్ని చట్టాలను న్యాయ సమీక్ష నుంచి కాపాడుతుంది. దీనికి తమిళనాడులో అమలవుతున్న 69 శాతం రిజర్వేషన్లను ఉదాహరణగా బీసీ సంఘాలు చూపిస్తున్నాయి. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేసినా, ఎవరూ కోర్టుకెళ్లకుండా ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతాయి. అలా కాని పక్షంలో.. పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి, 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే ఏ ఆటంకం లేకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు జరుగుతాయి.
కుల గణన సర్వే ప్రకారం…
ఈ ఏడాది ఫిబ్రవరి 4న అసెంబ్లీలో కుల గణన సర్వే ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారతదేశంలో బీహార్ తర్వాత కులగణన ఫలితాలను ప్రకటించిన రెండవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సర్వే ప్రకారం జనాభాలో (ముస్లిం బీసీలు 10.08 శాతంతో కలిపి) బీసీలు 56.33 శాతం, షెడ్యూల్డ్ కులాలు 17.43శాతం, షెడ్యూల్డ్ తెగలు 10.45 ఉన్నారు. ముస్లింలు 12.56 శాతం, ఇతరులు 3.23 శాతంగా ఉన్నారు.