ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం
ప్రభుత్వానికి సింగరేణి వారసత్వ
ఉద్యోగ బాధితుల వేడుకోలు
ఏడు నెలలుగా సమావేశం కాని మెడికల్ బోర్డ్
2 వేలకు పైగా దరఖాస్తుల పెండింగ్
ఆర్థికంగా చితికి పోతున్న కుటుంబాలు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్)లో వారసత్వ ఉద్యోగాల కోసం బాధితులు కండ్లల్లో వత్తులేసుకుని ఏండ్లుగా నిరీక్షిస్తున్నారు. మెడికల్ అన్‌ఫిట్ అయినా చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉద్యోగమొస్తుందనే ఆశతో ఆస్తులను…అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లకు పంచి అప్పుల పాలయి ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నా చితక వ్యాపారాలు, ప్రయివేటు నౌకరీలు చేసుకుంటూ సింగరేణి అధికారుల చుట్టు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కానరావడం లేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారైనా దారి తెన్ను చూపిస్తుందనుకుంటే మరింత కఠినంగా వ్యవహరిస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం సారూ…కనికరించండని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై 2002లో అప్పటి ప్రభుత్వ నిషేధం విధించింది. వాటిని పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయి. అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఆ కల నెరవేరలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2016 నవంబర్‌లో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. అదే ఏడాది అక్టోబర్ 11 నాటికి 48-56 సంవత్సరాల వయస్సు మధ్యగల కార్మికులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కార్మికుల కుమారులు, అల్లుండ్లు, సోదరులు వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హులని పేర్కొంది. ఈ క్రమంలోనే సింగరేణి సంస్థ మెడికల్ బోర్డును 2018లో ఏర్పాటు చేసింది. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తులను సమీక్షించడానికి బోర్డు ప్రతి నెలా సమావేశం అవుతుందని యాజమాన్యం ప్రకటించింది. ఆరోగ్య సమస్యలు ఉన్న వారితో పాటు రెండేండ్లలోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు, భూ నిర్వాస బాధితులు మొదలగు వారి దరఖాస్తులను పరిశీలించి వారి పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ పేర్కొంది. అప్పటి నుంచి 2025 వరకు ఏడేండ్ల కాలంలో దాదాపు 120కి పైగా మెడికల్ బోర్డు సమావేశాలు జరిగాయి. అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వివిద కేటగిరీల్లో సుమారు 13,500 మందికి స్కిల్డ్, అన్‌స్కిల్డ్ విభాగాల్లో వారసత్వ ఉద్యోగాలు దక్కాయి. అయితే గత ఏడు నెలలుగా మెడికల్ బోర్డు సమావేశం జరగలేదు.
బోర్డు తీరుపై బాదితుల ఆగ్రహం…
మెడికల్ అన్‌ఫిట్ అయి పేరు తపుగా పడ్డవారు, విజిలెన్స్ కేసులను ఎదుర్కుంటున్న వారు, సర్టిఫికెట్లలో తప్పులు దొర్లిన వారు, భూములు కోల్పోయి దశాబ్దాలుగా వివిద కారణాలతో ఎదురు చూస్తున్నవారు… మొదలగు నాలుగు రకాల కేటగిరిల్లో దాదాపు రెండు వేలకు పైగా డిపెండెంట్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో మెడికల్ బోర్డు ప్రతి నెలా జరిగిన సమావేశాల్లో వచ్చిన దరఖాస్తుల నుంచి 70 నుంచి 80 శాతం మెడికల్ అన్‌ఫిట్ అయ్యేవారు. కాని గత రెండేండ్లుగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. వచ్చిన దరఖాస్తుల్లో 5 నుంచి 20 శాతం వరకు మాత్రమే మెడికల్ అన్‌ఫిట్ అవుతున్నాయి. ఏడు నెలల క్రితం జరిగిన మెడికల్ బోర్డులో 200 దరఖాస్తులు రాగా కేవలం 12 మందిని మాత్రమే బోర్డు అన్‌ఫిట్ చేసింది. మెడికల్ బోర్డు తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపెండెంట్ జాబ్ పథకాన్ని బలహీనపర్చేందుకే సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు సమావేశాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. క్రమంగా ఈ పథకానికి మంగళం పలికేందుకు సంస్థ కుట్ర పన్నుతోందనే విమర్శల వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఉన్న 18-35 ఏండ్ల వయసు నిబంధనను సర్కార్ 35 నుంచి 40 ఏండ్లకు పెంచినా ప్రయోజనం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగం ఇప్పించండి లక్క శ్రావణ్, గోదావరి ఖని
నా పేరు లక్క శ్రీనివాస్, మాది గోదావరి ఖని. మా తండ్రి లక్క రాజయ్య 2019లో మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. పేరు తప్పుందని సింగరేణి సంస్థ ఆరేండ్లుగా ఇబ్బందులు పెడుతోంది. అధికారులు, రాజకీయ నాయకుల నుంచి మొదలుకుని అందరికి విజ్ఞప్తి చేశాం. అయినా ఫైలు ముందుకు కదలడం లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు వెంటనే ఉద్యోగం ఇప్పించగలరు.
15 ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం –పల్లె సంతోష్, గోదావరి ఖని
మా తండ్రి పల్లె రాయమల్లు 2010లో మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. అప్పటి నుంచి వారసత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. పేరులో పొరపాటు ఉందని నా ఫైల్‌ను ఆపారు. పదిహేనేండ్ల నుంచి తిరగని ఆఫీసు లేదు. కలవని నాయకులు లేరు. తాత్కాలికంగా చిన్న ఉద్యోగం చేసుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాను.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం – పి.హరీశ్, 5ఇంక్లైన్, గోదావరి ఖని
మా తండ్రి 2016లో మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. ఉద్యోగానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సింగరేణి సంస్థకు సమర్పించాం. చిన్న చిన్న కారణాలు చూపెడుతూ కొర్రీలు పెడుతున్నారు. మా తండ్రి అన్‌ఫిట్ అయిన తర్వాత మాకు రావాల్సిన క్వార్టర్ అలవెన్స్ డబ్బులు కూడా ఇంకా చెల్లించలేదు. నాకు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను.
ప్రభుత్వం ఆదుకోవాలి -రామిండ్ల సందీప్, గోదావరి ఖని
మా తండ్రి రామిండ్ల ళింగయ్య ఆనారోగ్య కారణాల వల్ల 2021లో మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. నాకు ఒక సిస్టర్ ఉంది. నేను కష్టపడి పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాను. సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆదుకోవాలని వేడుకుంటున్నాను.



