నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వైన్ షాపులకు జనాభాను ప్రామాణికంగా తీసుకుని కొత్త లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. ప్రస్తుత లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్ 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుల ఫీజును రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు రెండేళ్ల కోసం లైసెన్సులు జారీ చేయనున్నట్లు పేర్కొంది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కూడా కల్పించింది. గౌడ్ లకు 15 శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు వర్తించే ఈ కొత్త విధానం ప్రకారం, జనాభాను బట్టి ఫీజులను పలు స్లాబులుగా విభజించారు.
అబ్కారీ శాఖ నిర్ణయించిన వివరాల ప్రకారం
– 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ. 50 లక్షలుగా నిర్ణయించారు.
– 5 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ. 55 లక్షలు చెల్లించాలి.
– 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న చోట ఫీజు రూ. 60 లక్షలుగా ఉంది.
– లక్ష నుంచి 5 లక్షల జనాభా వరకు రూ. 65 లక్షలు ఖరారు చేశారు.
– 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 85 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
– 20 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు, పట్టణాల్లో అత్యధికంగా రూ. 1 కోటి 10 లక్షల లైసెన్స్ ఫీజును నిర్ణయించారు.
– ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండటంతో, రాబోయే విడతకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కోసం అబ్కారీ శాఖ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది.
ముగుస్తున్న వైన్ షాపుల లైసెన్సులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES