నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘోరమైన పేలుడు సంఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం విచారం వ్యక్తం చేశారు. సున్నితమైన దర్యాప్తులో నిమగ్నమైన భద్రతా సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రమాదాలకు ఈ సంఘటన విషాదకరమైన జ్ఞాపిక అని అభివర్ణించారు.
“జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పోలీస్ స్టేషన్‌లోనే పేలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయాయిన విషయం తెలిసిందే. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే… ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృందం సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి.
దీంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, నయీబ్ తహసీల్దార్ సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి, షేర్-ఏ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్)కు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.



