జైలు శిక్ష పడుతున్నా..వీడీసీ తీరుమారట్లే
కల్లుసీసా ధర రూ.3 పెంచుతామన్నందుకు..
ఆంక్షలు పెట్టిన ఆర్మూర్ మండలం పిప్రీ వీడీసీ
నవతెలంగాణ-ఆర్మూర్
వీడీసీల తీరు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీస్‌బాస్ సైతం వీటి ఆగడాలపై కఠినంగా వ్యవహరిస్తూ పెండింగ్ కేసులకు త్వరతగతిన శిక్షలు పడేలా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల ఓ వీడీసీ సభ్యులకు జైలు శిక్ష సైతం పడింది. అయినా వీడీసీల్లో మార్పు రావట్లేదు. తాజాగా కల్లు రేటు పెంపు విషయంలో ఏకంగా 54 గౌడ కుటుంబాలను బహిష్కరించిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రిలో మంగళవారం వెలుగుజూసింది. తమపై వీడీసీ ఆంక్షలు పెట్టి బహిష్కరించిందని గౌడ కులస్తులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లు విక్రయిస్తుండగా.. పెరిగిన ధరలకు అనుగుణంగా గిట్టుబాటు కావడం లేదని.. సీసా ధర రూ.12 ఉండగా.. అదనంగా మూడు రూపాయలు పెంచి 15 రూపాయలు చేస్తామన్నందుకు వీడీసీ బహిష్కరించారు. తెల్లకాగితంపై సంతకాలు పెట్టి ఇవ్వాలని.. తాము చెప్పినట్టు వినాలని వీడీసీ హుకుం జారీ చేసింది. గ్రామంలోని దుకాణాల్లో గౌడ కులస్తులకు సరుకులు ఇవ్వకుండా, ఆటోల్లోకి ఎక్కించుకోకుండా ఆంక్షలు పెట్టి బహిష్కరించారు. అలాగే, పలువురు గౌడ కులస్తులు హోటళ్లు, కిరాణ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తుండగా.. వారి వద్ద గ్రామస్తులెవరూ కొనుగోలు చేయవద్దని హుకుం జారీ చేశారని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కల్లు విక్రయిస్తున్నందుకు ఏడాదికి రూ.10లక్షలు వీడీసీకి ఇస్తున్నామని, అయినా తమను బహిష్కరించి మానసిక క్షోభకు గురి చేస్తున్న వీడీసీపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. ఇటీవల జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల బహిష్కరణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. గ్రామాల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్న వీడీసీల ఆగడాలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు, జిల్లా న్యాయ సేవా సంస్థ కొరడా ఝులిపిస్తున్నా మార్పు రావడం లేదని.. కఠిన చర్యలు తీసుకుంటేనే వీడీసీ ఆగడాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని బాధితులు వాపోతున్నారు.