Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

- Advertisement -

మన్ననూరులో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శన
విద్యార్థులతో మాట్లాడి శిక్షణా విధానం, సదుపాయాలపై కలెక్టర్ ఆరా
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నవతెలంగాణ – అచ్చంపేట

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ భాదా వత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ATC) ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని ఆధునిక పరికరాలు, శిక్షణ ల్యాబొరేటరీలు, వర్క్‌షాప్ విభాగాలు, తరగతి గదులను పరిశీలించి వసతులపై ప్రిన్సిపల్ తో కలెక్టర్ ఆరా తీశారు.

కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి, వారు పొందుతున్న శిక్షణ విధానం, ల్యాబ్ సదుపాయాలు, తరగతుల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మరింత కృషి చేసి నైపుణ్యాలను పెంపొందించుకుని మంచి అవకాశాలు సాధించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపల్ కలెక్టరుకు కేంద్రంలోని కోర్సుల వివరాలను తెలియజేశారు. మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్, అడ్వాన్స్‌డ్ సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ వంటి ఆధునిక కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వివరించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. ఏటీసీ వంటి ఆధునిక శిక్షణా కేంద్రాలు యువతలో నైపుణ్యాలు పెంపొందించడానికి, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను విస్తరించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి అని అన్నారు. తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, స్మార్ట్ బోర్డులు, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్ ద్వారా విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం శిక్షణ అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఏటీసీ కేంద్రాలు ఈ దిశలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నారు. ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఏటీసీ కేంద్రాల్లో శిక్షణ అందిస్తోందని తెలిపారు. దీని ఫలితంగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ గ్యారంటీ కల్పించబడుతోందని చెప్పారు. అంతేకాకుండా, ఈ శిక్షణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనే కాకుండా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశాలను కూడా పెంచుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే, స్వయం ఉపాధికి ఈ కోర్సులు దోహదపడతాయని చెప్పారు.  యువతీ యువకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను ఉన్నతస్థాయికి చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ లక్ష్మణా స్వామి, అమ్రాబాద్ తాహసిల్దార్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -