ఓయూ విద్యార్థి సంఘాల నిర్ణయం
అన్ని వర్సిటీల విద్యార్థులతో కలిసి కమిటీ
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో అసలు వివరాలు బయటపడాల్సిన అవసరం ఉందని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి నాయకులు బట్టు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఇటీవల ఆ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, అతని భార్య రాజేతో పాటు మరో నలుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు చెబుతున్నారని అన్నారు. మరుసటి రోజు జరిగిన మరో ఘటనలో ఏడుగురు సాయుధ మావోయిస్టులు మృతిచెందినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. అయితే ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంస్థలు ఈ ఘటనను ”బూటకపు ఎన్‌కౌంటర్”గా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటనా ఇవ్వకపోవడం అనుమానాలకు కారణమవుతోందన్నారు. లెనిన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రాణాలు, హక్కులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరింపబడుతున్నాయో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదుల్లో భయానక, గందరగోళ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో సంఘటనకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కలిసి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కమిటీ డిసెంబర్ 5న మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన ప్రదేశాలను పరిశీలిస్తుందని, కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల కుటుంబాలను కలుసుకుని వివరాలు సేకరించనున్నట్టు చెప్పారు. అలాగే, సంఘటనలో పాల్గొన్న ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డాను కూడా కలిసి స్పష్టత పొందేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో పాల్గొనడానికి మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, అలాగే మావోయిస్టు పార్టీకి బహిరంగ లేఖ పంపినట్టు వెల్లడించారు. ఈ నిజనిర్ధారణ కమిటీలో ఓయూ, కాకతీయ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు దేశంలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో విజయ్, పెంచాల సతీష్, నెల్లి సత్య, ఉప్పల ఉదయ్, పవన్ క్రాంతి, మహేష్, సుమన్, రవిచంద్ర, పాపారావు, మధు పాల్గొన్నారు.



