Wednesday, July 30, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో నకీలీ ఆయుర్వేదిక్ వైద్యం.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

ఆదిలాబాద్ లో నకీలీ ఆయుర్వేదిక్ వైద్యం.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

- Advertisement -

ముఠా మోసపు గుట్టురట్టు చేసిన పోలీసులు
పరారీలో ఏ1 ప్రధాన నిందితుడు
వాహనాలు, ఫోన్స్, మందులు, నగదు స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

నకిలీ ఆయుర్వేదిక్ వైద్యంతో మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో సాయి ఆయుర్వేదిక్ మందుల దుకాణం పేరుతో ముఠా నిర్వహిస్తున్న అక్రమాలపై పోలీసులు గుట్టురట్టు చేశారు. ఆయుర్వేద వైద్యం పేరుతో అనారోగ్యం నయమవుతుందని నమ్మబలికి బాధితుల వద్ద నకిలీ ఆయుర్వేదం మందులు అందజేసి డబ్బులు లూటీ చేశారు. ఈ కేసులో 9 మందిపై కేసులు నమోదు చేసి 8 మంది అరెస్టు చేశారు. ప్రధాన నిందితునికి పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. వీరి దగ్గర నుండి ఆరు ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు, నకిలీ ఆయుర్వేదిక్ మందులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పదివేల నగదు స్వాధీనం చేసుకోని, బ్యాంకులో 23 వేల నగదు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను 1 టౌన్ పొలీస్ స్టేషన్ లో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.

ఆదిలాబాద్ పట్టణంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ వద్ద, పలు సూపర్ మార్కెట్ల వద్ద అనారోగ్యంతో ఉన్న బాధితులను అందులో ముఖ్యంగా చిన్నపిల్లలను మహిళలను, వృద్ధులను ముఠా సభ్యులు గ్రహించి వారిని సంప్రదించి తమ కుటుంబ సభ్యులకు సైతం ఇదేవిధంగా సమస్య ఉండేదని దానికి ఒక ఆయుర్వేద బాబా ద్వారా తమ సమస్యలకు అనారోగ్య సమస్యలు నయం అయి, పూర్తి అయోగ్యంగా పరిష్కారం లభించిందని తెలిపినట్లు పేర్కొన్నారు. వారి వద్దనుండి మొబైల్ నెంబర్లను సేకరించి కీలక ప్రధాన సూత్రధారి అయిన ఏ1 కుమార్  (బాబా) కు అందజేశరన్నారు. ముఠాలో కీలక సభ్యుడైన కుమార్ (బాబా) వారికి ఫోన్ ద్వారా సంప్రదించి తాను ఒక ఆయుర్వేద వైద్యుడునని వివరాలను, సమస్యలను తెలుసుకుని ఈ సమస్యలకు పరిష్కారం ఉందని నమ్మబలికి, తన కుమారులను పంపిస్తానని చెప్పి ఆదిలాబాద్ లో ఉన్న తన ముఠా సభ్యులను వారి ఇంటికి పంపి ఇంట్లో ఉన్న వస్తువులతో ఒక మిశ్రమాన్ని తయారుచేసి ఈ మిశ్రమానికి మావల పోలీస్ స్టేషన్ పరిధిలో బాబా కు సంబంధించిన ఒక ఆయుర్వేదిక్ దుకాణంలో లభిస్తాయని నమ్మబలికరని అన్నారు.

వారిని వెంట పట్టుకొని ఐదు గ్రాములు, 10 గ్రాములు సంబంధించిన నకిలీ మూలికలను, ఒక గ్రాము 5000 – 10000 చొప్పున బాధితులకు అమ్మి, లక్షలలో దండుకోవడం మోసం చేయడం వీరి ముఠా చేస్తున్న అక్రమ దందా అని వెల్లడించారు. వీరందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా తెలిపారు. వీరందరూ ఇదివరకే సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలలో ఇలాంటి మోసాలకు పాల్పడి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మోసాలకు పాల్పడడం జరిగిందని తెలిపారు. తదుపరి ఇతర జిల్లాకు వెళ్లకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అడ్డగించి వారి అక్రమాలను బట్టబయలు చేసిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి బాబాలను మూఢనమ్మకాలను నమ్మకుండా గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను సంప్రదించి సరైన వైద్య చికిత్సను తీసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన ఆయుర్వేదిక్ వైద్యం ద్వారా చికిత్సను పొందాలని ఇలాంటి మందులను వాడటం వల్ల తమ ఆరోగ్యం మరింత చెడిపోయి అనారోగ్య బారిన పడతారని విషయాన్ని గ్రహించాలని సూచించారు.

ఈ ముఠా సభ్యులపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు, టూ టౌన్ లో ఒకటి, మావలాలో రెండు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు వీరందరిపై బిఎన్ఎస్ 318(4), 316 తో కేసు నమోదు అయిందని తెలిపారు. ఈ ముఠా సభ్యులలో 8 మందిని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కీలక నిందితుడి పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కీలక నిందితుడు వీరందరికీ నకిలీ పేర్లతో మొబైల్ ఫోన్ లను, సిమ్ కార్డులను అందజేయడం జరుగుతుందని, తదుపరి ఈ మొబైల్ ఫోన్ లను సిమ్ములను నాశనం చేయడం జరుగుతుందని తెలిపారు. కలిసికట్టుగా ప్రజలను మోసగించి సంపాదించిన డబ్బులను వారందరూ పంచుకునేవారని తెలియజేశారు. ఈ ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్న వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్సై నాగనాథ్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బీ.సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, కే.స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -