రైతులందరూ వివరాలను నమోదు చేయించుకోవాలి
పాలకుర్తి డివిజన్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు పరశురాం నాయక్
నవతెలంగాణ – పాలకుర్తి
రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి అని పాలకుర్తి డివిజన్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్ సూచించారు. శనివారం మండలంలోని మల్లంపల్లిలో రైతుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పరశురాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు వివరాల నమోదు పట్ల రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు.
రైతు వివరాల నమోదు ప్రక్రియను చేపట్టామని, వివరాలను అందజేయని రైతులు స్థానిక వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులకు సమాచారాన్ని అందించి రైతు గుర్తింపు కార్డు కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాలు రైతు గుర్తింపు కార్డుతోనే సాధ్యమన్నారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్న రైతులు రైతు గుర్తింపు కార్డు కోసం వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతు ఆధార్ కార్డుకు లింకు అయి ఉన్న ఫోన్ నంబర్ తో వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అవిస్తరణ అధికారి ప్యారపు శ్యామల తో పాటు రైతులు పాల్గొన్నారు.



