– పరకాల -హనుమకొండ జాతీయ రహదారిపై ధర్నా
– రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాల రవాణా – ప్రయాణికులకు అవస్థలు
పరకాల-నవతెలంగాణ : హనుమకొండ జిల్లా పరకాలలో యూరియా కొరతపై రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. యూరియా అందక సాగు సీజన్ మధ్యలో తీవ్రంగా నష్టపోతున్నామంటూ పరకాల–హనుమకొండ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రైతుల ఆందోళన కారణంగా రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు దాదాపు గంటసేపు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. అత్యవసర పనుల కోసం ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధర్నా ఆరంభమైన గంటకు గానీ పోలీసులు అక్కడికి చేరుకోకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎట్టకేలకు పరకాల ఎస్ఐ విఠల్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రైతులు మాట్లాడుతూ, వర్షాకాలం పంటల కీలక దశలో ఎరువుల కొరత తలెత్తడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుద్ధి కొరవడమే కారణమన్నారు. రోజుల తరబడి యూరియా కేంద్రాల వద్ద వడిగాపులు పడేలా చేస్తుండడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూరియాను తక్షణమే అందుబాటులోకి తేవాలని, సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేస్తామంటూ హెచ్చరించారు.
అధికారులు గైర్హాజరుపై ఆగ్రహం
రైతులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పిఎసిఎస్ సొసైటీ అధికారులు సోమవారం ఉదయం టోకెన్లు పంపిణీ చేసినప్పటికీ మూడు రోజులు గడిచినా యూరియా పంపిణీ చేపట్టలేదన్నారు. దీంతో మంగళవారం అర్థరాత్రి నుండే వందలాది మంది రైతులు పరకాల రైతు వేదిక వద్దకు చేరుకుని క్యూలైన్లలో చెప్పులు పెట్టి వేచి చూశారు. బుధవారం ఉదయం 7.30 గంటలైనా అధికారులు అక్కడికి రాకపోవడంతో రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారని తెలిపారు. ఆగ్రహంతో ఎట్టకేలకు జాతీయ రహదారిపై ధర్నాకు దిగినట్లు వారు పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వం యూరియా తక్షణ సరఫరా జరిగేలా చూడకపోతే తమ పోరాటం మరింత తీవ్రంగా కొనసాగుతుందని రైతులు మండిపడ్డారు. రైతుల సమస్యలపట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పరకాల వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పరకాలలో యూరియా కొరతపై రైతుల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES