నవతెలంగాణ – వనపర్తి
ఇటీవల కురిసిన కాల వర్షాలకు వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ శివారులో వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం శుక్రవారం పరిశీలించింది. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం సభ్యులు సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బొబ్బిలి నిక్సన్ తదితరులు రైతుల పంట పొలాలకు వెళ్లి పరిశీలించి పంట నష్టాన్ని ప్రభుత్వం సర్వే చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పామిరెడ్డిపల్లి గ్రామ రైతు కె ఆంజనేయులు, శేషయ్య, బీసీ రెడ్డి తదితరుల పొలాల దగ్గరికి వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. 
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.50,000 చొప్పున పరిహారం చెల్లించాలని పుట్ట ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల దాన్యంలో తేమ శాతం పెరిగిన దృశ్య 20 శాతం తేమ ఉన్న కొనుగోలు చేయాలని కోరారు. వెంటనే నష్టాలను అంచనా వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలన్నారు. వరి పంటలు భారీ వర్షాలకు గాలి దుమారానికి వరిచేలు భూమిపై కప్పబడ్డాయన్నారు. దాంతో నీరు ఉండడం వల్ల పొలాలంతా నీరు చేరి పంటలు మొలకెత్తుతున్నాయన్నారు. భూమిపై తడిసి పంట ముద్దయిందన్నారు. కొంత వరి పంట పాల ఒడ్లు ఉండగానే భూమిపై నీళ్లలో పడిందని, అది చేతికి రావడం కష్టంగా ఉన్నదన్నారు.
రైతులు ఒరిసెలు ఉన్నదాన్ని కోసుకుందామంటే వరి కోసే మిషన్లు నాలుగు వేలు ఎకరాకు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాసిల్దార్లు ఈ వరిచేలు మిషన్ యజమానులకు చెప్పి రెండు వేలకు ఎకరా కోసే విధంగా ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎకరా మూడు నాలుగు గంటలు పడుతుందన్నారు. ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు రైతులు నష్టపోయారని, వారికి ప్రభుత్వం రూ.50,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం వర్షాలకు కొట్టుకుపోయిందన్నారు. తడిసి ముద్దయిందని పంటలు దెబ్బతినడంతో పాటు చేలల్లో మీటలు వేసిన ఒండ్రు ఇతరత్రా చెత్తాచెదారం తొలగించడానికి మరికొంత వెచ్చించాల్సి ఉంటుందన్నారు. అనేకచోట్ల ఈ పంట తీవ్రంగా నష్టపోయిందని వీటిని సరిగ్గా అంచనా వేసి పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి రోడ్లు, పొలాల దగ్గర ఆరబెట్టిన వడ్లను తక్షణం కొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.


 
                                    