Thursday, July 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఫాసిజం - నియో ఫాసిజం పోలికలు, తేడాలు

ఫాసిజం – నియో ఫాసిజం పోలికలు, తేడాలు

- Advertisement -

మధురై మహాసభల్లో ఆమోదించిన సీపీఐ(ఎం) రాజకీయ తీర్మానంలో మోడీ ప్రభుత్వం గురించి ‘నియో ఫాసిజం’ లక్షణాలు కలిగి ఉంది అని చెప్పటం, రాజకీయవర్గాల్లో కొంత చర్చ లేవదీసింది. దేశంలో మోడీ ప్రభుత్వం ఎన్నో అణచివేతలు, అకృత్యాలు, శ్రామికవర్గ, ప్రజా వ్యతిరేక చర్యలకు మూకుమ్మడి హత్యలకూ కారణమవుతున్న వేళ ఆ ప్రభుత్వాన్ని ఫాసిస్టు అనటానికి సీపీఐ(ఎం) నిరాకరిస్తోందనీ, తద్వారా దానిపట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నదనేదాకా కొందరు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కొన్ని కమ్యూనిస్టు పార్టీలు మోడీ ప్రభుత్వాన్ని ‘ఫాసిస్టు’గా పేర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్చకు కొంత ప్రాధాన్యమేర్పడింది.
మనదేశంలోనే కాదు, ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే అనేక ముఖ్యమైన దేశాల్లో కూడా ఈ నియో ఫాసిస్టు లక్షణాలు ముందుకొస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఎన్నికల్లో కూడా ఈ శక్తులు గణనీయ విజయాలు సాధించాయి. ఇట లీలో మెలోనీ, జర్మనీలో ఎఎఫ్‌డి, అమెరికాలో ట్రంప్‌, టర్కీలో ఎర్దోగన్‌ వగైరాలు సాధించిన విజయాలు చూడండి. అందువల్ల ఇది మనదేశంలోనేకాదు, ఈనాటి ప్రపంచధోరణిగా ఉందనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ దేశాల ప్రభుత్వాలన్నింటిని ‘ఫాసిస్టు’ ప్రభుత్వాలని అనలేము.
1929-30లలో ప్రపంచవ్యాపిత ఆర్థిక సంక్షోభం ‘మహా మాంద్యం’ ఏర్పడిన సమయంలో ‘ఫాసిజం’ మందుకొచ్చింది. జర్మనీలో హిట్లర్‌, ఇటలీలో ముసోలినీ, జపాన్‌లో టోజోవగైరాలు పేరుమోసిన నియంతలుగా, నర హంతకులుగా చరిత్రలో మిగిలిపోయారు. వాటిని ఫాసిస్టు ప్రభుత్వాలుగా పేర్కొన్నాం. ఆనాటి పరిపాలన లక్షణాలకు ఇప్పటి మోడీ, ట్రంప్‌ వగైరాల పాలనా పద్ధతులకు తప్పకుండా కొన్ని పోలికలున్నాయి. అదే సమయంలో ముఖ్యమైన, మౌలికమైన తేడాలూ ఉన్నాయి.

మొదటిది: ఆనాటి నియంతలు తమదేశంలోని ఒక బలహీనమైన మైనారిటీ తరగతిని శత్రువుగా చూపి మెజార్టీకి వారిపై ద్వేషం పెంచి తాము రాజకీయంగా బలపడ్డారు. ఉదాహరణకు హిట్లర్‌ జర్మన్‌ జాత్యహంకారంతో యూదులపై ద్వేషం పెంచి మూకుమ్మడి హత్యాకాండ సాగించిన విషయం మనకు తెలుసు. ఈనాడు మోడీ ముస్లింలపైనా, ట్రంప్‌ అమెరికాకు వచ్చిన వలసదారులపైనా ఇదే వైఖరితో జులుం సాగిస్తున్నారు.
రెండవది : ఒక నియంతృత్వ ప్రభు త్వాన్ని కలిగి ఉండటం. జర్మనీ,ఇటలీ వగైరాల నియంతృత్వం ప్రభుత్వాల్లాగే ఈనాటి మోడీ, ట్రంప్‌లు కూడా ప్రతి పక్షాలను, ప్రతిపక్ష రాష్ట్రాలను ఏవిధంగా నియంతృత్వ విధానాలతో అణచివేస్తున్నారో మన అనుభవంలో ఉంది.
మూడవది: ప్రభుత్వ సైన్యమేగాకుండా ప్రయివేటు సైన్యాలు కలిగి ఉండటం. నిజాం పాలనలో రజాకార్లు, మోడీ పాలనలో గోరక్షణ బృందాలు, విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ వగైరా సాయుధమూకలు ఈ కోవలోకే వస్తాయి.

నాలుగోది: ఈలక్షణమేమిటంటే వ్యక్తిపూజ, నియంతలు తయారుకావటం. ఆనాడు జర్మనీ అంతా ‘హై..హై హిట్లర్‌’ అంటూ ఎలా ఊగిపోయిందో మనకు తెలుసు. ఇప్పుడు మోడీ భజన కూడా అలాగే సాగుతోంది. కీలక సమయాల్లో (మొన్నటి ఇండియా,పాకిస్తాన్‌ యుద్ధంలో కూడా) ఏ ఒక్క ఇతర దేశమూ మనల్ని బలపర్చిన దాఖలాలు లేవు. అయినా ‘విశ్వ గురువుగా మోడీగారు వారి భక్తులచేత అందుకుం టున్న నీరాజనాలు, ఆఖరుకు స్వతంత్రంగా ఉండాల్సిన ప్రజాస్వామ్యానికి నాలు గోస్తంభం లాంటి ‘మీడియా’ కూడా ‘మోడీ మీడియా’గా మారిపోయిన వైనం మనం చూస్తున్నాం.
అయిదోది: ముఖ్యమైందీ అయిన మరో లక్షణం ఏమిటంటే ఈ నియంతృత్వ శక్తులతో గుత్తపెట్టుబడి మిళితం కావటం, అంటే ఈ నియంతృత్వ ప్రభుత్వాల్ని కార్పొరేట్‌ శక్తులు సంపూర్ణంగా సమర్ధించటం, బలపర చటం అన్నమాట. ఇది అనాడు కూడా జరిగింది. ఈనాడూ జరుగుతోంది. అయితే ముఖ్యమైన వ్యత్యాసం ఉంది.

కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ నాయకుడు డిమిట్రోవ్‌ ఫాసిజం గురించి ”ఫైనాన్స్‌ పెట్టుబడి యొక్క సామ్రాజ్యవాద, అతి దురభిమాన, అతి అభివృద్ధి నిరోధక శక్తుల ప్రత్యక్ష నియంతృత్వమే ఫాసిజం” అన్నాడు. అది ”అంతర్గతంగా విప్లవ శక్తులను అణచివేస్తుంది. బాహ్యంగా ఇతర దేశాలను ఆక్రమించటానికి(మార్కెట్ల కోసం) యుద్ధాలను ప్రోత్సహిస్తుంది” అని కూడా వివరించాడు. ఇక్కడో విషయం గుర్తు చేయాలి. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1971-72లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు తొత్తడం చేసి దాదాపు వేయిమందికి పైగా కమ్యూ నిస్టు కార్యకర్తలను ప్రయివేటు గుండాల సైన్యాలతో అతి కిరాతకంగా హత్యలు చేశారు. ఆస్తులు లూటీలు చేశారు. ఆ తర్వా తనే ఎమర్జెన్సీ అకృత్యాలూ కొనసాగాయి. అయినా ఆ ప్రభుత్వాన్ని ‘అర్ధఫాసిస్టు చర్యలని’ పోల్చాము తప్ప ఫాసిస్టు అనలేదు. ఎందు కంటే అవి ఎంత క్రూరమైన పాలన సాగించినా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం నిర్దారించిన అంతర్గత లక్షణాన్ని మాత్రమే ఆ పాలన కలిగి ఉంది గానీ బాహ్యలక్షణం దానికి లేదు. అంటే ఫాసిజంలో ఒక కోణం మాత్రమే అమలు జరిగింది.

కొత్త మార్కెట్ల కోసమే యుద్ధాలు
ఫాసిజం అంకురించిన 1929-33 సంవత్సరాల్లో ప్రపంచం మహామాంద్యంలో చిక్కుకుపోయింది. అంటే పెట్టుబడిదారీ దేశాలు ఉత్పత్తి చేస్తున్న సరుకులు అన్నీ అమ్ముడుపోని స్థితి వచ్చింది. దీన్నుంచి బయటపడటానికి ఆనాడు రెండు పద్ధతులు ప్రయోగించారు. మొదటిది అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ అనుసరించిన ‘న్యూడీల్‌’ మార్గం. అంటే ప్రభుత్వం లోటుబడ్జెట్‌ పెట్టి ఆమేరకు నోట్లు ముద్రించి ప్రజల్లోకి వదిలి సరుకుల డిమాండ్‌ పెంచటం. అంటే రోడ్లు వేయించటం, చెట్లు నాటించటం, ప్రభుత్వ భవనాలు కట్టించటంలాంటి పనులు సృష్టించి(నేటి ఉపాథి హామీపథకం లాగా అన్నమాట) ప్రభుత్వడబ్బు చెల్లించటం. తద్వారా మార్కెట్లోకి డబ్బు ప్రవహించి ప్రజల కొనుగోలు శక్తి పెంచటం చేశారు. అయితే కొద్దిరోజులకే దీన్ని పెట్టుబడిదారులు వ్యతిరేకించి రద్దు చేయించారు. ఇక మరోమార్గం కొత్త మార్కెట్ల కోసం యుద్ధాలు చేయటం. ఇప్పటికి రెండు ప్రంచ యుద్ధాలూ ఇందుకోసమే జరిగాయి. ఈ యుద్ధాలు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు పెట్టుబడిదారులకు ఉపయోగపడ్డాయి. ఎలాగంటే యుద్ధం చేయాలంటే యుద్ధసామాగ్రి ఉత్పత్తులు బాగా పెంచాలి. సైనికుల రిక్రూట్‌మెంట్‌, మిలటరీ ఫ్యాక్టరీల్లో కార్మికులు, ఉద్యోగులు అవసరం. ఆవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది. ప్రజల్లోకి డబ్బువస్తుంది కాబట్టి కొనుగోలుశక్తి పెరిగి ఆర్ధిక సంక్షోభం పరిష్కార మవుతుంది. యుద్ధంలో ధ్వంసమైన సంపద సృష్టికి మళ్లీ ఉత్పత్తులు అవసరమైతాయి. ఆనాడు హిట్లర్‌ అధికారంలోకి రాగానే యుద్ధ సన్నాహాల కోసం జరిగిన ఖర్చుతో నిరుద్యోగం తగ్గిపోయింది. యుద్ధంతో ఆర్థిక సంక్షోభమూ పరిష్కారమైంది. యుద్ధం తర్వాత పెట్టుబడిదారీ విధానం చాలా వేగంగా(చరిత్రలో ఎన్నడూ లేనంతగా) అభివృద్ధి చెందటానికి అది మూలమైంది. ఈ ప్రయోజనాలు గమనించగలిగారు కాబట్టే ఆనాటి గుత్త పెట్టుబడి దారులు హిట్లర్‌లాంటి ఫాసిస్టు శక్తులతో కలగలిసిపోయారు.

‘సోవియట్‌’ విజయాలు,పాఠాలు
రెండో ప్రపంచయుద్ధం తర్వాత సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలో బలమైన ‘సోషలిస్టు శిబిరం’ ఏర్పడింది. పతనం తర్వాత దాని గురించిన పాఠాల్లో ఎన్ని విమర్శలు జరిగినప్పటికీ సోవియట్‌ సాధించిన అతి ముఖ్యమైన మూడు విజయాలను మనం ఎపుడూ మర్చిపోకూడదు. అవి 1.ఫాసిజాన్ని ఓడించటం 2.వలస రాజ్యాలన్నీ సామ్రాజ్యవాద శృంఖలాలనుండి విముక్తి కావటం.3.ఏడు దశాబ్దాల పాటు సంక్షేమ రాజ్యాన్ని ప్రజల కందించటం. వలసవిముక్తి ఉద్యమాలు కమ్యూనిస్టులతో చేతులు కలుపుతున్నారనే భయంతో సామ్రాజ్యవాదులు వలసల విముక్తి ప్రకటించాల్సి వచ్చింది. వలస మార్కెట్లు కోల్పోతున్న క్రమంలోనూ, సోవియట్‌ సంక్షేమరాజ్య మోడల్‌ను ప్రతి ఘటించాలంటేనూ పెట్టుబడిదారీ దేశాలు కూడా సంక్షేమ రాజ్యాల మోడల్‌ను అమలు జరపటానికి పూనుకున్నాయి. అంటే ఈ సంక్షేమ పథకాల అమలు 1970 వరకూ కొనసాగాయి.ఆ తర్వాత ఉదారవాద విధానాలతో ప్రపంచీకరణ మొదలైంది.
ఉదారవాద, ప్రపంచీకరణ విధానాల్లో సంక్షేమాలు, సబ్సిడీలు ఉండవు. ప్రభుత్వ ఖర్చు తగ్గించబడుతుంది. అంటే ప్రభుత్వం జోక్యమే లేకుండా ప్రజల బతుకుల్ని మార్కెట్‌కు వదిలేయాలనేది ఆవిధానాల సారాంశం. అయితే ఇందుకో మినహాయింపు ఉంటుంది. బడా పెట్టుబడి దారులకు ఇబ్బందులొస్తే మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. 2008లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సంక్షోభం నుండి బయట పడటానికి కార్పొరేట్‌ శక్తులకు వివిధ ప్రభుత్వాలు లక్షల కోట్ల డాలర్లు సబ్సిడీలు ఇచ్చిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు ట్రంప్‌ బిగ్‌బ్యూటిఫుల్‌ బిల్‌ పేరిట దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్లు పెట్టుబడిదారులకు పన్నులు తగ్గించారు. అలాగే మనదేశంలో మోడీ కూడా.

నయా ఉదారవిధానాల సంక్షోభం
ప్రపంచీకరణలో ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూడాలి కదా? ఈ విధంగా సంక్షేమాలు కట్‌ చేసి, ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తే ప్రజలు పేదవాళ్లవు తారు. వాళ్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది. వాళ్ల ఆకలి పెరుగుతుంది ఇది ప్రజల బాధ. కానీ ఇంకోవైపున ప్రజల దగ్గర డబ్బులేనపుడు, పెట్టుబడిదారులు ఉత్పత్తి చేస్తున్న సరుకులు ఎవరు కొంటారు? ప్రజలు కొనకపోతే వాళ్ల ఉత్పత్తులు ఏమవుతాయి? మిగిలిపోతాయి. దాన్నే సంక్షోభం అంటున్నాం. అదే ఇప్పుడు జరుగుతోంది. ఈ పరిస్థితి అంతకంతకూ ముదిరి ‘పెట్టుబడి పైన’ దాని ప్రభుత్వాలపైన ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. దీనికి పరిష్కారం దొరక్క ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు తలలు పట్టు కుంటున్నారు. దీన్నే మనం ”నయా ఉదారవాదం, ప్రపంచీకరణ విధానాలు సంక్షోభంలో పడ్డాయి, వాటికి చావు దగ్గరకు వచ్చింది” అంటున్నాం. ఈ నయా ఉదారవాద విధానాల సంక్షోభం నుండి తలెత్తిన రూపమే నయా ఫాసిజం. ఒకనాడు హిట్లర్‌ రోజుల్లో పెట్టుబడికి వచ్చిన ఇలాంటి సంక్షోభాన్ని పరిష్కరించటానికి ఫాసిజం తాత్కాలికంగా ఉపయోగపడింది. కానీ ఈనాడు పెట్టుబడికి వచ్చిన వ్యతిరేకతను మార్గం మళ్లించటానికి ప్రస్తుత నయా ఫాసిజం ఉపయోగపడుతోంది తప్ప దాన్ని పరిష్కరించటానికి కాదు. అంటే ఆ ప్రజల్లో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను ఒక మతంపైనో, ప్రాంతంపైనో, కులంపైనో మళ్లించి ఉద్యమాలు బలహీనం చేయటం నయాఫాసిజం లక్షణం. ఇది ముఖ్యమైన తేడా అనేది మనం గమనించాలి.

సామ్రాజ్యవాదుల వైరుధ్యాల్లో తేడాలు
మరో ముఖ్యమైన తేడా ఏమిటంటే క్లాసికల్‌ ఫాసిజం యుద్ధాలను సంక్షోభాలకు పరిష్కారంగా వాడుకుంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు ఆనాటి లాగా తీవ్రస్థాయి శత్రువైరుధ్యంగా లేవు. ఎం దుకంటే అన్నిదేశాల పెట్టుబడీ కలిసిపోయి ‘అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి’గా పెట్టుబడి రూపాంతరం చెందిన నేటి పరిస్థితిలో ఆ వైరుధ్యం తాత్కాలికంగా (మ్యూట్‌)నిలిచిపోయింది. మరో తేడా ఏమిటంటే ఆనాటి ఫాసిజం ఎన్నికలను, పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని రద్దుచేసింది. కానీ ఇప్పుడు నియోఫాసిజం ఎన్ని కలను ఉపయోగించుకుంటోంది. ఉదార విధానాలపై వచ్చే అసంతృప్తిని వాడుకుని ఎన్నికల్లో గెలుస్తుంది. గెలిచాక కూడా అదే విధానాలు అవలంభిస్తుంది. ఆ కారణంగా ఓడిపోయినా గెలిచిన వాడూ అదే విధానాలు అవలంభిస్తాడు గాబట్టి మళ్లీ వచ్చే అసంతృప్తి కోసం ఎదురు చూస్తుంది. మళ్లీ గెలుస్తుంది (అమెరికాలో ట్రంప్‌లాగా) కూడా. ప్రజల్లో వచ్చే అసంతృప్తిని ఒక సెక్షన్‌పైకి మళ్లిస్తుంది. అందరూ ఐక్యం కాకుండా ప్రభు త్వాలపై పోరాడకుండా ప్రజలు తమలో తామే పోరాడుకునేట్లు చేస్తుంది. ఇదే నియోఫాసిజం ప్రత్యేకత. ఫాసిజం యుద్ధపిపాసి. కానీ నియోఫాసిజం యుద్ధాలకు వెళ్లదు. ఒక పాలనకు ఫాసిజం అని పేరు పెట్టడమంటే దాన్ని కూల్చే ఐక్య సంఘటనా, ఎత్తుగడలూ మారిపోతాయి. నేటి స్థితిలో అది నేలవిడిచి సాము చేయటమే అవుతుంది.

తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -