Monday, August 4, 2025
E-PAPER
Homeక్రైమ్ఏపీ గ్రానైట్‌ క్వారీలో ఘోర ప్రమాదం

ఏపీ గ్రానైట్‌ క్వారీలో ఘోర ప్రమాదం

- Advertisement -

– ఆరుగురు వలస కార్మికులు దుర్మరణం
– ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
– గవర్నర్‌, సీఎం, మాజీ సీఎం దిగ్భ్రాంతి
– న్యాయ విచారణకు సీసీఐ(ఎం) డిమాండ్‌
అమరావతి :
బాపట్ల జిల్లా బల్లికురవ వద్ద ఉన్న సత్యకృష్ణ గ్రానైట్‌ క్వారీ పైభాగం నుంచి గ్రానైట్‌ రాళ్లు జారి కింద పడడంతో అక్కడ పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు వలస కార్మికులు దుర్మరణం చెందారు. ఎనిమిదిమంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్వారీ యాజమాన్యం ఎటువంటి రక్షణ చర్యలూ తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తోటి కార్మికులు చెప్తున్నారు. రాష్ట్ర గవర్నరు అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌, వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి జిల్లా కలెక్టర్‌ పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఆదివారం జరిగిన ఈ ఘోరప్రమాదానికి సంబంధించి తోటి కార్మికుల కథనం ప్రకారం… రోజూ మాదిరిగానే గ్రానైట్‌ క్వారీలో పనికి వెళ్లిన కార్మికులు అక్కడ ఉన్న గ్రానైట్‌ రాళ్లను కటింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో గ్రానైట్‌ రాళ్లు పైనుంచి విరిగి కింద పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో, నలుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన పది మందిని నర్సరావుపేట వైద్యశాలకు తరలించగా, అక్కడ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతుల్లో దండ బడత్య (48), టకున దలారు (37), బనమల బెహరా (30), భాస్కర్‌ భిషోరు (40), సంతోష్‌ గౌడ్‌ (36), ముస్సాజన (43) ఉన్నారు. వీరంతా ఒడిశా రాష్టం గంజాం జిల్లాకు చెందిన వారు. తీవ్రంగా గాయడిన వారిలో ఎ.సుదర్శన్‌, అలక్‌ నాయక్‌, సిరా గౌడ, ఎస్‌.వెంకయ్య, ఎల్‌ సుభాష్‌ మాలిక్‌, పవిత్ర బెహ్ర, శాంత నాయక్‌, దంబా ఉన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో క్వారీలో మొత్తం 16 మంది పనిచేస్తున్నారు.
విచారణకు సిఎం చంద్రబాబు ఆదేశం
క్వారీలో ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం, మరికొందరు గాయపడడంపై రాష్ట్ర గవర్నరు అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌, వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ ఏపీరాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్‌ మాధవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఈ సంఘటనపై విచారణ చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సిఎం ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్వారీ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆదేశించారు. క్వారీ ప్రమాదంలో ఆరుగురు మరణించడం అత్యంత బాధాకరమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బిసి జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు రవాణా శాఖ మంత్రి మండపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి సూచించారు.
మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల చొప్పున పరిహారం : కలెక్టర్‌
నర్సరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్‌ జె.వెంకటమురళి పరామర్శించారు. శనివారం కురిసిన వర్షం కారణంగా క్వారీలో ఉన్న మట్టి కదలడంతో గ్రానైట్‌ బండలు కిందికి జారి పడ్డాయని ప్రాథమిక నివేదికలో తేలిందని తెలిపారు. ఈ ప్రమాదం విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో మాట్లాడారని చెప్పారు. మృతుల కుటుంబాలకు సిఎం ఆదేశాల మేరకు రూ.14 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. స్వల్ప గాయాలైన వారికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఘటనపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరుగుతుందని, జరిగిన ప్రమాద సంఘటనపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులతో సమీక్షిస్తున్నట్లు చెప్పారు. క్వారీ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్‌పి తుషార్‌ డూడి పరిశీలించారు. ప్రమాదం జరగడానికి దారితీసిన అంశాలపై పరిశీలించారు.
ప్రమాదకరమైన క్వారీలను మూసివేయాలి : రమాదేవి
అద్దంకిలో ప్రభుత్వాస్పత్రిలో ఉన్న కార్మికుల మృతదేహాలను సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతదేహాలను గౌరవప్రదంగా వారి కుటుంబసభ్యులకు అందజేయాలని కోరారు. ప్రమాదకరమైన క్వారీలను వెంటనే మూసివేయాలని డిమాండ్‌ చేశారు.
న్యాయ విచారణ : సీసీఐ(ఎం) డిమాండ్‌
ఈ ప్రమాదం పట్ల సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యంతోపాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని కోరా రు. క్వారీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారని, ఈ నేపథ్యంలో కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. క్వారీ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి లేదన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -