టూరిస్టు బస్సుపై విరిగిపడిన కొండచరియలు
18 మంది మృతి..కొనసాగుతున్న సహాయక చర్యలు
బిలాస్‌పూర్: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సుపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 18 మంది మృతి చెందారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35మంది ఉన్నట్టు సమాచారం. శిథిలాల కింద చిక్కుకు పోయిన వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని రోహ్‌తక్ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఘుమర్విన్‌కు ఓ ప్రయివేటు టూరిస్టు బస్సు బయలుదేరింది. ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి చేరుకోగానే కొండచ రియలు విరిగి బస్సుపై పడ్డాయి. దీంతో బస్సు శిథిలాల కింద చిక్కుకుపోయింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బృందాలు పలువురిని ప్రాణాలతో బయటకు తీశాయి. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు.