బీఆర్‌ఎస్‌కు కల్వకుంట్ల కవిత గుడ్‌బై
ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ
చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ కేసీఆర్‌కు విజ్ఞప్తి
హరీశ్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. ట్రబుల్ క్రియేటర్ అంటూ ఎద్దేవా
ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు తనను గాయపరిచిందంటూ ఆవేదన
మున్ముందు అందర్నీ గాయపరుస్తుందని హెచ్చరిక
సంతోశ్‌కు ధనదాహం ఎక్కువని ఆరోపణ
ఏ పార్టీలోకి వెళ్లేది లేదు
అందరితో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీమా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన లేఖను తెలంగాణ భవన్ ఇన్‌ఛార్జి రావుల చంద్రశేఖరరెడ్డికి, ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి పంపారు.
బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… రాజీనామా గురించి ప్రస్తావించారు. ఇప్పటి వరకు పార్టీలో తనపై జరిగిన కుట్రలు, వివక్ష గురించి ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, తనను బయటకు పంపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ జోగినేపల్లి సంతోశ్‌కుమార్‌లపై కవిత మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారు అవినీతి పరులు, వారి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందంటూ పునరుద్ఘాటిం చారు. బీఆర్‌ఎస్‌లోని కొందరు (హరీశ్, సంతోశ్) తనపై పని గట్టుకుని దుష్ప్రచారం చేశారని వాపోయారు. డబ్బు ఆలోచన, సంపాదన యావ ఉన్నవాళ్లే తమ ముగ్గుర్ని (కేసీఆర్, కేటీఆర్, కవిత) విడదీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొదట తనను బయటకు పంపా రంటూ చెప్పుకొచ్చారు. ఇది ఇక్కడితో ఆగదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నాన్నా.. మీ వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్న దాన్ని, మీ చుట్టూ ఏం జరుగుతోందో దయచేసి తెలుసుకోండి…’ అంటూ కేసీఆర్‌ను వేడుకు న్నారు. కేటీఆర్‌కు మున్ముందు ప్రమాదం పొంచి ఉందంటూ హెచ్చరించారు. తద్వారా బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకు నేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.
తనపై అక్రమ కేసుల నేపథ్యంలో తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉన్నానని కవిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు, గురుకులాల్లోని సమస్యలు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం తదితరాంశాలపై తెలంగాణ జాగృతి తరపున పోరాడానని ఆమె గుర్తు చేశారు. వీటితోపాటు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, బనకచర్ల, భద్రాచలం ముంపు ప్రాంత సమస్యలపై అనేక కార్యక్రమా లను నిర్వహించానని తెలిపారు.
తనకు పార్టీకి వ్యతిరేకంగా పని చేయాలనే ఆలోచనే ఉంటే గులాబీ కండువా కప్పుకుని, ఇవన్నీ నిర్వహించేదాన్నా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు తనను పార్టీ నుంచి ఎలా బహిష్కరిస్తారని ఆమె నిలదీశారు. ఈ విషయాలపై బీఆర్‌ఎస్‌లోని పెద్దలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు, సంతోశ్ ఇళ్లల్లో బంగారం ఉంటే అవుతుందా? సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది కదా? అని ఆమె వ్యాఖ్యానించారు. తాను సామాజిక తెలంగాణ కావాలని అడగటంలో తప్పేముందని ప్రశ్నించారు.
ఒక అన్నకు చెల్లిగా, మహిళా ఎమ్మెల్సీగా తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ గతంలో తెలంగాణ భవన ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పానని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టించు కోలేదని విమర్శించారు. ఈ విషయంలో కనీసం నాకు ఫోన్ చేసే తీరిక కూడా మీకు లేదా అన్నా…? అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. పార్టీలో తనకే న్యాయం జరగనప్పుడు ఇక మామూలు మహిళా కార్యకర్తల పరిస్థితేంటని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో హరీశ్‌రావు మొదట్నించీ ఉన్నారన్న వాదనలో వాస్తవం లేదని కొట్టి పారేశారు. ‘మా నాన్న టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మొదట వ్యతిరేకించింది హరీశ్‌రావే, మనకెందుకు మామా.. ఇవన్నీ, కోటిన్నర ఇస్తామంటున్నారు, తీసుకుని బిజినెస్ చేద్దాం’ అంటూ హరీశ్ ఆనాడు తన తండ్రిని వెనక్కులాగేందుకు ప్రయత్నించారని విమర్శిం చారు. 2009లో వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన్ను కలిసి చర్చలు జరిపిన వారిలో హరీశ్ రావు ముందు వరుసలో ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా సీఎం రేవంత్‌కు ఆయన లొంగిపోయారని ఆరోపిం చారు. ఇటీవల రేవంత్, హరీశ్ ఒకే విమానంలో ప్రయాణించారని తెలిపారు. ‘హరీశ్, సంతోశ్ బీఆర్‌ఎస్‌ను పట్టిపీడిస్తున్న జలగలు…’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరూ తమ (కేసీఆర్, కేటీఆర్, కవిత) మంచి కోరుకునే వారు కాదంటూ దుయ్యబట్టారు. హరీశ్‌రావును అందరూ ట్రబుల్ షూటర్ అని ఆకాశానికెత్తేస్తున్నారు, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్, గతంలో సిరిసిల్లలో కేటీఆర్‌ను, నిజామాబాద్‌లో నన్ను, కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించేందుకు కుట్రలు పన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరడుగుల బుల్లెట్టు ఇప్పుడు నన్ను గాయపరిచింది, మున్ముందు అందర్నీ గాయపరస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో మాట్లాడిన హరీశ్‌రావు, రెండో అభ్యర్థిని నిలబెట్టాలంటూ సూచించారు, ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి చెబితే కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లా. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీశ్ రావు విడిగా డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బు కాళేశ్వరం అవినీతిలోంచి వచ్చింది కాదా? అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన మూలంగానే గతంలో ఈటల రాజేందర్, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయ రామారావు తదితర సీనియర్లంతా పార్టీ నుంచి బయటకు పోయారని చెప్పారు. మరోవైపు కేసీఆర్ వెంట నీడలా ఉండే సంతోష్‌కు ధనదాహం ఎక్కువని విమర్శించారు. హరితహారం పేరు చెప్పి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక నకలీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో తన ఓటమి, కామారెడ్డిలో కేసీఆర్ ఓటమిలో సంతోశ్ పాత్ర కూడా ఉందని కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో సంతోశ్ బాధితులు ఎంతో మంది ఉన్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో, బీఆర్‌ఎస్ అభివృద్ధిలో తన పాత్ర లేదా? అని కవిత ఈ సందర్భంగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అనేది సాఫ్ట్‌వేర్ అయితే.. తెలంగాణ జాగతి హార్డ్‌వేర్ లాంటిదని చెప్పారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. తాను ఏ పార్టీలోనూ చేరబోవటం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే జాగృతి కార్యకర్తలు, మేధావులు, బీసీ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనీ, దీనికి హరీశ్‌రావు, సంతోష్, శ్రవణ్‌లే బాధ్యులని ఆరోపించారు.
నాన్నా.. ఇదిగో నా రాజీనామా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES