Sunday, October 12, 2025
E-PAPER
Homeసోపతిమూకీల నిర్మాణానికి సాక్ష్యం 'పితప్రేమ'

మూకీల నిర్మాణానికి సాక్ష్యం ‘పితప్రేమ’

- Advertisement -

సామాజికాంశాల చుట్టూ కథను అల్లి 1929లో నిర్మించిన పితప్రేమ మూకీలోని మొదటి రీల్‌ మాత్రమే ప్రస్తుతం మనకు మిగిలున్న ఒకే ఒక్క ఆధారం. ఐతే దొరికినంత మటుకు చిత్ర నిర్మాణంలోగానీ, కథలోగానీ కన్పించే ఏక సూత్రతను బట్టి ఈ రకమైన మూకీ చిత్రాల్లో ఇది పరిణితి చెందిన శైలీ నిర్మాణాలకు ఉదాహరణగా కన్పిస్తుందని చెప్పొచ్చు. బాధ్యత గల సంతానం గురించీ, అవేవీ పట్టించుకోని చెడిపోయిన కొడుకుల గురించీ సుదీర్ఘమైన వర్ణనలతో మొదలై అలాంటి సంతానం వల్ల ‘పెనం మీంచి పొయిలో పడిన’ చందంగా మారిన ఓ గహస్థు జీవితం గురించిన పరిచయ వాక్యాల స్టైడ్‌లతో ఈ చిత్రం మొదలవుతుంది.
1913లో దాదా ఫాల్కే తొలి భారతీయ కథా చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మించి భారతీయ సినిమా చరిత్రకు దేశీయ పునాదులు వేశారు. అట్లా 1913లో ప్రారంభమైన భారతీయ సైలెంట్‌ చిత్రాల యుగం 1934 వరకు కొనసాగింది ఈ 20 సంవత్సరాల కాలంలో మొత్తం భారతదేశంలో 1288 సైలెంట్‌ చిత్రాలు తయారైనవి. ఇందులో దక్షిణ భారతదేశంలో మద్రాస్‌, హైదరాబాద్‌, మైసూర్‌, కేరళలో తయారైన మూకీ చిత్రాల సంఖ్య 122. మొత్తం 1288 చిత్రాలలో కేవలం 13 చిత్రాలు మాత్రమే లభ్యమై పూనా ఫిలిం ఆర్కైవ్స్‌లో భద్రపరచబడినవి. వీటిలో ఫాల్కే తీసిన రాజా హరిశ్చంద్ర(1917), కాళీయ మర్ధన్‌ (1919), శ్రీకష్ణ జన్మ, లంకా దహన్‌(1920), హిమాన్షురాయి తీసిన ది లైట్‌ ఆఫ్‌ ఆసియా (1925), సిరాజ్‌ (1928), ప్రపంచ పాష్‌(1929), జి. పి. పవార్‌ తీసిన జంట చిత్రాలు దిలేర్‌ జిగర్‌, గులామీ కా పతన్‌ (1931), హరిలాల్‌ ఎం. బట్‌ తీసిన పిత ప్రేమ్‌ (లేదా ఫాదర్స్‌ లవ్‌ -1929), కేరళలో పివి రావు తీసిన మార్తాండ వర్మ (1933), మరో రెండు సంత్‌ తుకారాం(1921), భక్త ప్రహ్లాద(1926) వీటిలో ఉన్నవి.
ఈ 13 చిత్రాలలో మద్రాసులో తీసిన ఒక్క సైలెంట్‌ మూవీ కూడా లేకపోవడం గమనించదగిన విషయం. వీటిలో హైదరాబాదులో తయారైన ‘పిత ప్రేమ్‌’ లేదా ఫాదర్స్‌ లవ్‌ సినిమా ఉండటం హైదరాబాద్‌ సినీ చరిత్రకు గర్వకారణం. అంతేకాకుండా 1925లో హిమాన్షురారు తీసిన ‘లైట్‌ ఆఫ్‌ ఆసియా’లో హైదరాబాద్‌ కు చెందిన సునాళినీ దేవి, మణాళిని దేవి నటించడం ప్రత్యేకంగా పేర్కొనదగిన అంశం.
మళ్లీ హైదరాబాద్‌ మూకీ సినిమాల చరిత్రలోకి వద్దాం. 1922లో ధీరేన్‌ గంగూలీ కలకత్తా నుండి హైదరాబాదుకు వచ్చి 1924 వరకు 8 సైలెంట్‌ సినిమాలు తీసి తిరిగి కలకత్తా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1924 నుండి నాలుగైదేళ్లు ఏ విధమైనా మూకీ చిత్రాల నిర్మాణం జరగలేదు. అయితే 1929లో ‘మహవీర్‌ ఫొటో ప్లేస్‌’ అనే సినీ నిర్మాణ సంస్థ ఆవిర్భవించి ‘ఫాదర్స్‌ లవ్‌’ లేదా ‘పితప్రేమ’ అన్న మూకీని 1929లో నిర్మించింది. ఇది హైదరాబాదులో మూకీల చరిత్రలో రెండవ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఈ ‘ఫాదర్స్‌ లవ్‌’ (పితప్రేమ) చిత్రం హరిలాల్‌ ఎం.భట్‌ దర్శకత్వంతో తయారైంది.
హిందీ, ఉర్దూ, గుజరాతి, ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌తో విడుదలైంది ఈ చిత్రం. ఈ చిత్రంలో బాలనటుడిగా నటించి ఆ తరువాత సినీ డిస్ట్రిబ్యూటర్‌గా మారిన మదన్‌ కొటారి ఈ సినిమా రీలును భద్రపరిచి ఆ తరువాత నేషనల్‌ ఆర్కైవ్స్‌కు అప్పగించాడు.
సామాజికాంశాల చుట్టూ కథను అల్లి 1929లో నిర్మించిన పితప్రేమ మూకీలోని మొదటి రీల్‌ మాత్రమే ప్రస్తుతం మనకు మిగిలున్న ఒకే ఒక్క ఆధారం. ఐతే దొరికినంత మటుకు చిత్ర నిర్మాణంలోగానీ, కథలోగానీ కన్పించే ఏక సూత్రతను బట్టి ఈ రకమైన మూకీ చిత్రాల్లో ఇది పరిణితి చెందిన శైలీ నిర్మాణాలకు ఉదాహరణగా కన్పిస్తుందని చెప్పొచ్చు. బాధ్యత గల సంతానం గురించీ, అవేవీ పట్టించుకోని చెడిపోయిన కొడుకుల గురించీ సుదీర్ఘమైన వర్ణనలతో మొదలై అలాంటి సంతానం వల్ల ‘పెనం మీంచి పొయిలో పడిన’ చందంగా మారిన ఓ గహస్థు జీవితం గురించిన పరిచయ వాక్యాల స్టైడ్‌లతో ఈ చిత్రం మొదలవుతుంది. తర్వాతి ఫ్రేములో చిత్రంలోని పాత్రలన్నిటి పరిచయం వుంటుంది. ఉదాహరణకి మధుమల్‌- తండ్రి, ఉదాతుడైన కుటుంబ పెద్ద, పట్టణ నాగరీకుడు; మహామాయ-తల్లి, బాధ్యతగల ఇల్లాలు; శశిభూషణ్‌-కొడుకు; అన్నపూర్ణ-కోడలు; మాధవ-దత్తపుత్రుడు.
మధుమాల్‌ (తండ్రి) తన గడీ బయట మూగిన గ్రామస్థులకు (బహుషా అతని కౌలు రైతులు కావొచ్చు, డబ్బులు పంచుతూ కన్పిస్తాడు. తర్వాతి ఫ్రేములో అతను గుంపులో గాయపడిన ఓ చిన్న పిల్లవాడిని ప్రేమతో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లడం కన్పిస్తుంది. సినిమాలో తొలి విలన్‌ రోచక్‌ చంద్‌ (మార్వాడీపేట్‌) ఈ పై సంఘటన చూసి చూడటంతోనే తన మతానికి సంబంధించిన పిల్లవాడిపై మధుమల్‌ అంత ప్రేమను చూపటాన్ని చిలువలు పలువలుగా వక్రీకరిస్తూ రంగ ప్రవేశం చేస్తాడు. మధుమల్‌ అందుకు జవాబుగా బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికీ, ఆలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటికీ సమానంగా డబ్బులు విరాళంగా చెక్కు రూపంలో పంపించి తన సెక్యులర్‌ భావాలను బహిరంగంగా ప్రకటిస్తాడు. ఈ సంఘటనతో రోచక్‌ చంద్‌ రెచ్చిపోయి సంప్రదాయ విరుద్ధమైన ఇలాంటి పనులకి మధుమల్‌ ఫలితం అనుభవించాల్సొస్తుందని హెచ్చరిస్తాడు.
మరుసటి రోజు శశిభూషణ్ని కలవడానికి వచ్చిన సంగీత విద్వాంసుడైన గుబ్బాదాస్‌ ప్రేక్షకులకు మరో విలన్గా పరిచయమవుతారు. శశిభూషణ్‌కి ఒక శంగార కవిత సారాంశాన్ని తనదైన స్వభావంలోంచి దాస్‌ వివరిస్తున్న సమయంలో అక్కడే వున్న అన్నపూర్ణ (శశిభూషణ్‌ భార్య, మధుమల్‌ కోడలు) అతని అన్వయంలోని అనౌచిత్యాన్ని ఎత్తి చూపుతుంది. కాబోయే ఇంటి యజమాని మనస్సుని కలుషితం చేయెద్దని దాసును హెచ్చరిస్తుంది. దీన్ని అవమానంగా భావించిన దాసు ప్రతీకారం కోసం వేచివుంటాడు. అందులో భాగంగా నూర్జహాన్‌ అనే నాట్యకత్తెనూ, దురాశాపరుడైన ఆమె తండ్రి కరీంఖాన్నీ కలుస్తాడు. ధనవంతుడైన కుమారుడిని (అంటే శశిభూషణ్‌) వారి వరకు చిక్కేట్టు చేస్తానని వారితో మంతనాలాడుతాడు. ఈ రీల్‌ ఇక్కడితో ఐపోయింది.
దొరికిన ఈ మాత్రం రీల్ని బట్టి కథ ఏ తీరుగా నడుస్తుందో మనకు అర్ధమౌతుంది.
బలహీనుడైన కొడుకుకీ, ధర్మం కోసం పరితపించే తండ్రీ విలువలకోసం నిలబడే భార్య (అన్నపూర్ణ)లకీ నడుమ నడిచే సంఘర్షణలను ఈ చిత్రం ప్రదర్శిస్తుందని ఊహించవచ్చు. ఈ సినిమా కథాగమనాన్ని మనం ఒక్కసారిగా పరిశీలిస్తే దక్షిణ భారతంలో 1928 లో వచ్చిన మలయాళీల విగత కుమారన్‌ తర్వాత తొలిసారిగా మూకీ సినిమాల కాలంలోనే సామాజిక సమస్యలను కథా వస్తువుగా తీసుకుని నిర్మాణమైన చిత్రం ఇదేనని తేలుతున్నది.
ఇక శైలీ నిర్మాణాల విషయానికొస్తే అప్పటికి ప్రఖ్యాతుడైన జర్మనీ దర్శకుడు ప్రాంజ్‌ ఓస్టన్‌ నిర్మించిన చిత్రాలకి భిన్నమైన శైలి భారతీయ మూకీ చిత్రాలన్నిటిలోనూ కన్పిస్తుందని చెప్పొచ్చు. సమాంతర దష్టికోణాన్ని ప్రధానంగా అనుసరిస్తూ ముఖాముఖి చిత్రీకరణలను భారతీయ మూకీలు అనుసరించినై. భారతీయ సినిమాశైలిలో ఈ తరహా సమాంతర దష్టి చిత్రీకరణలకు సంప్రదాయిక భారతీయ చిత్రకళా శైలితో పాటు కంపెనీ నాటకరంగ ధోరణులు సైతం దోహద పడినాయనొచ్చు. కథ చెప్పేరీతిలో అనుసరించే సాధారణ ధోరణులూ, పాత్రలనూ వాటి స్వభావాలకూ టైటిల్‌ కార్డ్‌ ద్వారా చెప్పడమూ, ఆయా పాత్రల స్వభావానుసారంగా కథాంశంలోని గమనాన్ని సూచించడము ఇందుకు దాఖలాలుగా కనిపిస్తాయి.
ఈ మూకీ సినిమాలో మిస్‌ మణి, మిస్‌ గాబిహిల్‌, మగన్‌ లాల్‌ దవే, యూసుఫ్‌,వై.ఎల్‌. చిచేంకర్‌ , ఎస్‌.పి. నిఫాడ్కర్‌, మాస్టర్‌ మదన్‌ లాల్‌ నటించారు.
మొత్తానికి ఎన్‌. హరిలాల్‌ భట్‌ ఈ సినిమాకే గాక మరిన్ని కొన్ని మూకీ సినిమాలు నిర్మించినప్పటికీ తిరిగి నాటకరంగాన్నే తన ఎంచుకొని పనిచేసినట్లు తెలుస్తున్నది. కొసమెరుపు : మదన్‌ కొఠారీ అనే సినిమా డిస్ట్రిబ్యూటర్‌ ఈ సినిమాలో బాల నటుడిగా నటించాడు. తను నటించిన ఈ రీల్ని ఆయన భద్రంగా దాచుకోవడంవల్లే మనకీమాత్రం ఆధారమైనా మిగిలింది. లైట్‌ ఆఫ్‌ ఆసియా, ఇండియన్‌ సైలెంట్‌ సినిమా (1895-1932), ”ఎన్‌ సైక్లోపీడియా ఆఫ్‌ ఇండియన్‌ సినిమా”లో ఈ ఫాదర్స్‌ లవ్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.


మహవీర్‌ ఫోటో ప్లేస్‌
హైదరాబాదులో1929లో జోరావర్‌ మోతీలాల్‌ అండ్‌ సన్స్‌ ప్రారంభించిన మహవీర్‌ ఫోటో ప్లేస్‌ సంస్థ ‘పిత ప్రేమ’ తర్వాత 1930లో ‘రాజధర్మ’, ‘అవరైజ్‌’, ‘యాన్‌ ఐడియల్‌ విమెన్‌’ అన్న మూకీలు తీసింది. 1931లో ‘బ్లాక్‌ ఈగల్‌’, ‘కిడ్నాప్‌డ్‌ బ్రైడ్‌’, ‘నిర్ధర్‌ నిరు’ చిత్రాలను నిర్మించారు. 1930 లో వీరే మహావీర్‌ ఫోటో ప్లేస్‌ అండ్‌ థియేటర్స్‌ అనే ఒక అనుబంధ సంస్థను నెలకొల్పి1931లో హరిలాల్‌ భట్‌ దర్శకత్వంలోనే ‘సరోజ్‌ కుమారి’ అన్న మూకీని తీశారు. ఇందులో శంకర్‌, మణి ప్రధాన పాత్రధారులు. అయితే 1931 జనవరి 20న ఏ కారణం చేతనో హైదరాబాదులో ఈ సినిమాను నిషేధించారు.


(వ్యాసకర్త: తెలంగాణ చరిత్రకారుడు)
హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -