నవతెలంగాణ-రామాయంపేట/నంగునూరు
సర్పంచ్ ఎన్నికల వేళ.. పోటీకి కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా మారుతున్న పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ఎన్నికల్లో పోటీ పడుతుండటంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఒకే పదవికీ ఒకే కుటుంబం నుంచి ప్రత్యుర్థులుగా నామినేషన్లు వేయడంతో.. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పదవి కోసం తండ్రీకొడుకులు పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన మానెగళ్ళ రామకృష్ణయ్య, ఆయన కొడుకు వెంకటేశ్ నామినేషన్లు దాఖలు చేశారు. వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన మానేగాళ్ళ రామకృష్ణయ్య గతంలోనూ సర్పంచ్‌గా గ్రామానికి సేవలు అందించారు. ఈసారి తండ్రి పైన పోటీకి తన కొడుకే సిద్ధమవ్వడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తిని పెంచింది.
తండ్రీకొడుకులు ఇద్దరూ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ, గ్రామాభివద్ధికి కషి చేస్తామని హామీ ఇస్తున్నారు. కాగా, ఈ గ్రామంలో మొత్తం 10 వార్డులు, 1563 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో సర్పంచ్ పదవికి 10 నామినేషన్లు దాఖలయ్యాయి.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములిద్దరూ నామినేషన్ వేశారు. కాగా ఖానాపూర్‌కు గత ఎన్నికల్లో ఓసీ జనరల్ మహిళ స్థానం కేటాయించగా.. ఐలేని సత్తవ్వ(బీసీ) సర్పంచ్‌గా పనిచేశారు. అయితే ఈసారి బీసీ జనరల్‌కు అవకాశం లభించడంతో.. సత్తవ్వ కుమారులు ఐలేని యాదగిరి, ఐలేని సతీశ్ ఇద్దరూ పోటీలోకి దిగారు. వీరితోపాటు మరొక బీసీ అభ్యర్థిగా బాల్ద మల్లేశం నామినేషన్ దాఖలు చేశారు. మరి కొంతమంది బరిలో ఉన్నప్పటికీ.. వీరిమధ్యే త్రిముఖ పోటీ ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. 1035 మంది వరకు ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఎవరు గెలుస్తారని ఉత్కంఠ నెలకొంది.
సర్పంచ్ పోరులో..తండ్రీకొడుకులు.. అన్నదమ్ములు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



