రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి డిమాండ
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలో రైతులు పండించిన లావు వడ్లను కూడా ధాన్యం కేంద్రాల్లో అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో చినగుంటపల్లి సింగల్ విండో కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సుమారు 20 రోజుల క్రితం వడ్లు సెంటర్లకు తీసుకువచ్చి తేమ శాతం వచ్చినా కొనుగోలు కేంద్రాల్లో సరిగా కొనుగోలు చేయడంలేదన్నారు. లావు వడ్లు పండించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే లావు వడ్లను అధికారులు కొనాలన్నారు. గత రబీ సీజన్లో పండించిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 లు బోనస్ ఇస్తామని చెప్పి నేటి వరకు రైతులకు చాలామందికి ఇవ్వలేదన్నారు.
ఇప్పుడు లావు వడ్లను కొనమంటే సాకులు చెబుతున్నారని తెలిపారు. రైస్ మిల్లర్స్ వారు దింపుకుంటలేరని, తర్వాత కొంటామని కొన్ని కేంద్రాల్లో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఐదు నెలలపాటు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే రైతులు రాత్రింబవళ్లు కాపలా ఉండే పరిస్థితి ఏర్పడుతున్నదన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి లావు వడ్లను సన్న వడ్లను సకాలంలోకొని సకాలంలో అకౌంట్లో డబ్బులు పడేలా చూడాలన్నారు. అకాల వర్షాలు వస్తే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మధు, శ్రీనివాసులు, నరసింహ, నారాయణ, వెంకటయ్య, బాలరాజు, మన్యం, లక్ష్మి, లలిత, వెంకటేశ్వరమ్మ, నారమ్మ తదితరులు పాల్గొన్నారు.



