Wednesday, February 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఫిబ్రవరి 12 సమ్మె - ఆర్టీసీ కార్మికుల కర్తవ్యం

ఫిబ్రవరి 12 సమ్మె – ఆర్టీసీ కార్మికుల కర్తవ్యం

- Advertisement -

భారతదేశ ప్రజలపై, రైతు,కార్మికవర్గంపై కేంద్రపాలక బీజేపీ యుద్ధం ప్రకటించింది. కార్మికులు వందల ఏళ్లు పోరాటాలు చేసి సాధించుకున్న 29 చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌ల అమలుకు నోటిఫికేషన్‌తో పాటు రూల్స్‌ను కూడా విడుదల చేసింది. ప్రజలందరిపై భారంపడే విధంగా విద్యుత్‌ (సవరణ)బిల్లు -2025ని తెచ్చింది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధికి గ్యారెంటీ కల్పిస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజీరామ్‌ జీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతుల నడ్డివిరిచేందుకు నూతన విత్తన బిల్లును తీసుకొచ్చింది. మొత్తం ప్రభుత్వరంగాన్ని ప్రయి వేటు చేయడం, పబ్లిక్‌, ప్రయివేటు పార్టనర్‌షిప్‌ పేరున అన్ని రంగాల్లో కార్పొరేట్లకు ద్వారాలు తెరిచింది. ప్రజల సొమ్మును ఇన్సెంటివ్‌ల పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. వీటన్నింటిని సమీక్షిం చిన పది కేంద్రకార్మిక సంఘాలు, ప్రతిఘటనో ద్యమానికి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా 2026 ఫిబ్రవరి 12న ఒక్కరోజు సమ్మె చేయాలని, బీజేపీ సర్కార్‌ తన విధానాల నుండి వెనక్కి రాకపోతే బహుళదిన సమ్మెలకు సిద్ధ పడాలని పిలుపునిచ్చాయి. భారతదేశ కార్మికవర్గం చేస్తున్న సమ్మెకు వ్యవసాయ కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రక టించాయి. 420 రైతు సంఘాల ఐక్యవేదిక ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ కూడా కార్మిక సమ్మెకు మద్దతు ప్రకటించింది. కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు సభలు, సమావేశాలు జరపడం, కరపత్రాలు పంచడం, బుక్‌లెట్స్‌ అమ్మడం ద్వారా సమ్మెకు సిద్ధమైంది.
కోడ్స్‌ ఆర్టీసీ కార్మికులకు వర్తించవా?
కేంద్రం తీసుకువచ్చిన లేబర్‌కోడ్స్‌కు లోబడే ఆర్టీసీ కార్మికులు పని చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు మనకు వర్తించే ట్రేడ్‌ యూనియన్‌ యాక్ట్‌ -1926, పారిశ్రామిక వివాదాల చట్టం-1947, స్టాండింగ్‌ ఆర్డర్స్‌ చట్టం-1946లను రద్దు చేసి పారిశ్రామిక సంబంధాల కోడ్‌ – 2020గా తీసుకొచ్చారు. టియు యాక్ట్‌ ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో రాష్ట్ర స్థాయిలో మెజార్టీ ఓటింగ్‌ వచ్చిన సంఘం ‘సోల్‌ బార్గెయినంగ్‌’ సంఘంగా వుంటుంది. కానీ, ఇప్పటి కోడ్‌ ప్రకారం 51శాతం కార్మికుల మద్దతును పొందిన సంఘంతో మాత్రమే సంప్రదింపులు జరుపుతారు. అలా ఎవరికి రాకపోతే, 20శాతం ఓట్లు పొందిన కార్మిక సంఘాల నుండి ఒక్కరి చొప్పున ‘సంప్రదింపుల కమిటీ’ని ఏర్పాటు చేస్తారు. అన్ని కార్మిక చట్టాలు అమలులో వున్న నేపథ్యంలోనే 2016 తర్వాత ఇంతవరకు ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించలేదు. అలాగే 2021లో కాలం ముగిసిన సిసిఎస్‌కు కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదు. 2019 డిసెంబర్‌ నుండి ఆర్టీసీ కార్మికోద్యమంపై ఆంక్షలు విధించి, నేటికీ అమలు చేస్తున్నారు. ఆంక్షలు తొలగించాలని, ఎన్నికలు జరపాలని గత ఆరేళ్లుగా మనం ఒత్తిడి చేస్తున్న పాల కులు స్పందించడం లేదు. మరి సమ్మెలు చేయడానికి వీల్లేని నిబంధనలు తీసుకొచ్చే ఐఆర్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత మన పరిస్థితి ఏమిటి? ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం.
ఆర్టీసి కార్మికులకు వర్తించే కాంపెన్సేషన్‌ యాక్ట్‌ – 2011, ఇ.ఎస్‌.ఐ.-1948, పి.ఎఫ్‌ యాక్ట్‌ – 1952, మెటర్నిటీ యాక్ట్‌ – 1961, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం – 1972 లను మెర్జ్‌ చేసి సామాజిక భద్రతా కోడ్‌ – 2020ని తెచ్చారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు ప్రస్తుతం మ్యాండేటరీగా వున్నాయి. కోడ్‌ అమల్లోకి వస్తే, ఈ రెండు అమలు చేయడం అనేది కార్మికుల ఇష్టంపైన ఆధారపడి వుంటుందని కోడ్‌లో అంటున్నారు. అంటే ఉద్యోగంలోకి తీసుకొనేప్పటికి ఈ రెండు మాకక్కరలేదని రాయించుకొని ఉద్యోగాలిస్తారు. అలాగే ఈ రెండు స్కీంలలో ఎటువంటి మార్పులు చేయడానికైనా కేంద్ర ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. ఇఎస్‌ఐని రద్దు చేస్తే, దాని ప్రభావం మన వైద్య సదుపాయాలు (తార్నాక, డిస్పెన్సరీలు) పైన పడి, వాటికి దూరం అయ్యే ప్రమాదం వుంది. అలాగే ఇప్పుడు పి.ఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ 12శాతం కార్మికుడి వద్ద నుండి రికవరీ వస్తే, 12శాతం యాజమాన్యం జమచేస్తుంది. దీనిలో కూడా తగ్గించడానికి, పెంచడానికి, లేదా అసలే ఈ స్కీం నుండి మినహాయించడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇప్పటివరకు వున్న సామాజిక భద్రత కాస్తా ఆవిరైపోతుంది.ఆర్టీసి కార్మికులకు వర్తించే ఫ్యాక్టరీ యాక్ట్‌ – 1948, మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యాక్ట్‌ – 1961, కాంట్రాక్టు లేబర్‌ రెగ్యులేషన్‌, అబాలిషన్‌ చట్టం – 1970 తో పాటు మొత్తం 13 చట్టాలను రద్దు చేసి ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండీషన్స్‌ కోడ్‌ -2020గా తీసుకొచ్చారు.
టీజీఎస్‌ఆర్టీసిలో వున్న తొంభైఏడు గ్యారేజీలు, వర్క్‌షాప్‌లు, టైర్‌షాప్స్‌ వంటివి అన్ని ఈ కోడ్‌ పరిధిలోకి వస్తాయి. మన గ్యారేజీలు సరైన వర్కింగ్‌ కరడిషన్స్‌, సేఫ్టీ లేకపోతే లేబర్‌ డిపార్టుమెంటుకు కంప్లయింట్‌ చేస్తే, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్షన్‌కు వచ్చి పరిశీలిస్తారు. అవసరమైన చర్యలు తీసుకొంటారు. ఇప్పుడు కోడ్‌లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్షన్‌ స్థానంలో ‘ఇన్‌స్పెక్షన్‌కు పెసిలిటేటర్‌’గా మార్చివేసి లేబర్‌ డిపార్టుమెం టును కాస్తా యాజమాన్యాల సేవా సంస్థగా మార్చివేశారు.
స్పష్టతలేని కోడ్‌లు..పనిభారం!
ఆర్టీసి కార్మికులకు వర్తించే అతి ముఖ్యమైన చట్టం ఎం.టి.డబ్ల్యు యాక్ట్‌ – 1961 ఆ చట్టం ఇప్పుడు ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండిషన్స్‌ కోడ్‌ – 2020లో భాగంగా వున్నది. ఎం.టి.డబ్ల్యు యాక్ట్‌లో సెక్షన్‌ 13 నుండి 20 వరకు పని గంటలు, డ్యూటీ మధ్య విరామం, స్ప్రెడ్‌ఓవర్‌, స్ల్పిట్‌ డ్యూటీ, డ్యూటీ చార్టు ముందే తెలియజేయడం, వారాంతపు సెలవులు వంటి వాటిపై స్పష్టత వుంది. ఈ కోడ్‌లో వీటిపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోగా, అప్రాపరేట్‌ గవర్నమెంటు వాటి పట్ల స్పష్టత ఇస్తుందని మాత్రమే వుంది. (సెక్షన్‌ -123, సెక్షన్‌ – 135). ఇంతకుముందు 3 నెలలకు 75 గంటలు ఓవర్‌ టైంను ఇప్పుడు 145 గంటలకు పెంచారు. ఇప్పటికీ ఆర్టీసిలో ఎం.టి.డబ్ల్యు యాక్ట్‌కు అనుగుణంగా డ్యూటీలు లేవు. ఎం.వి.యాక్ట్‌కు భిన్నంగా కూడా ప్రభుత్వాలు మినహాయిస్తున్నాయి. (టిమ్స్‌కు మినహాయింపు). ఇప్పుడు కోడ్స్‌ అమలులోకి వస్తే మనపైన పనిభారం పెంపునకు ఎటువంటి అడ్డూఅదుపు ఉండదు. అలాగే నాలుగు కోడ్‌లలోని వేతనాలు, సమ్మెలు, లేబర్‌కోడ్స్‌ రద్దు వంటివి మనకు వర్తిస్తాయి. ఇవన్ని అమల్లోకి వస్తే మన పని ‘పెనం నుండి పొయ్యి’లో పడ్డ చందంగా అవుతుంది.
విద్యుత్‌ బస్‌ల విధానం కూడా నేరుగా ఆర్టీసీలను నిర్వీర్యం చేసేవే. అందుకే ఆ విధానంలో మార్పుచేసి, ఆర్టీసీలకు అవకాశం కల్పించాలని, ఖర్చుకు అదాయానికి మధ్య వ్యత్యాసాన్ని రీ-ఎంబర్స్‌ చేయాలని కూడా కార్మికోద్యమం డిమాండు చేస్తున్నది. ఇప్పుడు ప్రస్తావించిన అంశాలన్నీ ఏదో ఒక ఆర్టీసిలో మాత్రమే అమలవుతున్నవి కావు. మొత్తం దేశంలోని అన్ని ఆర్టీసీలలో అమలవుతున్నాయి. వీటికి కేరళ మాత్రమే మినహాయింపుగా వుంది. అందుకని టిజిఎస్‌ ఆర్టీసి కార్మికులు తాము ఏ సంఘంలో సభ్యులుగా వున్నా కూడా ముందు సంస్థను రక్షించుకోవడం, కార్మికోద్యమాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడమే ప్రధానమైన కర్తవ్యం. అందుకని పాలక ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశ కార్మికవర్గం నిర్వహిస్తున్న పోరాటాల యుద్ధంలో మనం సైనికులుగా ముందు నడవాలి. ఇది మన బాధ్యత.

వి.ఎస్‌.రావు
9490098890

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -