– వారి అధికారాలు తగ్గించే దిశగా ట్రంప్ చర్యలు
– న్యాయవ్యవస్థ అధికారాలను ప్రశ్నించే వ్యూహం : రాయిటర్స్ విశ్లేషణ
– సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్లు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫెడరల్ న్యాయమూర్తులను టార్గెట్‌గా చేసుకున్నారు. తన విధానాలను అడ్డుకుంటున్న సదరు జడ్జిలపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన సుప్రీంకోర్టును వేదికగా చేసుకుంటున్నారని ‘రాయిటర్స్’ తన విశ్లేషణలో వివరించింది. 2025 ఫిబ్రవరి నుంచి ట్రంప్ ప్రభుత్వం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్లలో దాదాపు 97 శాతం కేసుల్లో న్యాయమూర్తులు అధ్యక్షుడి రాజ్యాంగబద్ధ అధికారాల్లో జోక్యం చేస్తున్నారని వాదించడం గమనార్హం.
రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం… గతేడాది ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన విధానాలను అడ్డుకున్న ఫెడరల్ జడ్జిలపై అభ్యంతరకరమైన పదజాలాన్ని వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ల ద్వారా న్యాయవ్యవస్థ అధికారాలను ప్రశ్నించే వ్యూహాన్ని కూడా ఆయన ప్రభుత్వం అనుసరిస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ట్రంప్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ సుప్రీంకోర్టులో 31 అత్యవసర పిటిషన్లు దాఖలు చేసింది. వాటిలో దాదాపు అన్నింటిలోనూ ఫెడరల్ జడ్జిలు అధ్యక్షుడి అధికారల్లో అనవసర జోక్యం చేసుకుంటున్నారని పేర్కొంది. గత బైడెన్ హయాంలో 19 పిటిషన్లు వేస్తే.. అందులో 26 శాతం మాత్రమే అలాంటి వాదనలు చేశాయి. ట్రంప్ అనుసరిస్తున్న ఈ విధానం అధ్యక్షుడి అధికారాలను విస్తరించడమే లక్ష్యంగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడి చర్యలను సమీక్షించే న్యాయవ్యవస్థ పాత్రను పరిమితం చేయాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తోందని వారు అంటున్నారు. న్యాయవ్యవస్థను అవమానిస్తూ, అదే సమయంలో దాని అధికారాలను తగ్గించే ప్రయత్నం కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడొచ్చని వారు వివరిస్తున్నారు.
ఫెడరల్ జడ్జీలే టార్గెట్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



