ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, ఎస్ ఎఫ్ ఐ, టిఆర్ఎస్వి విద్యార్థి సంఘాల ధర్నా
నవతెలంగాణ – వనపర్తి
పెండింగ్లో ఉన్న రూ.8300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, ఎస్ ఎఫ్ ఐ, టిఆర్ఎస్వి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి రాజీవ్ చౌక్, బస్ డిపో రోడ్డు మీదగా ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు రమేష్, గణేష్, వీరయ్య, యశ్వంత్ మాట్లాడుతూ గత ఐదు,ఆరు సంవత్సరాలుగా విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కళాశాలల బందు చేశారని తద్వారా పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు.
గత ప్రభుత్వం వేల కోట్లు పెండింగ్లో పెట్టింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు పెండింగ్లో ఉండేటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఓట్ల మీద సీట్ల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్తుపై లేదని అధికారులు ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయని వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేకపోతే విద్యార్థి సంఘాలుగా విద్యార్థులందరినీ ఏకం చేసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్వీ నాయకులు గోపాలకృష్ణ, వంశీ, దినేష్, సూర్యవంశం గిరి, అరవింద్, బన్నీ, వీరన్న విద్యార్థులు పాల్గొన్నారు.



