Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

- Advertisement -

విద్యార్ధుల భవిష్యత్‌తో చెలగాటం ఆడొద్దు
పెండింగ్‌ ఫీజులను విడుదల చేయకుంటే చలో హైదరాబాద్‌ చేపడతాం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన

నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
రాష్ట్రంలో ఆరేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న డా.బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం ఎదుట గురువారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు కండ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆరేండ్ల నుంచి సుమారు రూ.8 వేల కోట్లకు పైగా ఫీజు బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పారదర్శకంగా, దశల వారీగా విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఇచ్చిన టోకెన్ల నిధులు కూడా ఇవ్వలేదన్నారు.

విద్యాసంస్థల యజమాన్యాలు సమ్మె ప్రకటించి ఏడాది కాలంగా పోరాడితే రూ.1200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. హామీ మరిచిందని అన్నారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజు వసూలు చేస్తున్నాయని తెలిపారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతుల విద్యార్థులపై లక్షలాది రూపాయలు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఫీజుల చెల్లింపు కోసం జీవో ఇచ్చి వారి భవిష్యత్‌ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారని, పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఈ నెలలో పూర్తి బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థపై సీఎం రేవంత్‌ రెడ్డికి అవగాహన లేకపోవడం వల్లే విద్యారంగం ఆగమవుతోందని అన్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం బకాయిలు, డైట్‌, కాస్మోటిక్‌ చార్జీలు, ఫీజు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వెంటనే విద్యారంగ సమస్యలపై రివ్యూ నిర్వహించి నిధులు విడుదల చేయాలని, రాష్ట్ర యూనివర్శీటీలలో డైట్‌ చార్జీలు, యూనివర్శీటీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్‌, జె.రమేష్‌, హైదరాబాద్‌ జిల్లా నాయకులు నాగేందర్‌, రజినీకాంత్‌, కైలాస్‌ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్‌ స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు తేజ మాట్లాడుతూ.. తక్షణమే విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని, లేదంటే మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పరిగి పట్టణ కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అంబేద్కర్‌ విగ్రహం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -