ఈ ఏడాది భారతదేశం అద్భుతమైన నైరుతి రుతుపవనాలు చూసింది. జూన్ -ఆగస్టు వర్షపాతం చారిత్రక సగటుకంటే 6.1 శాతం ఎక్కువ. జూన్ 8.9, జులై 4.8, ఆగస్టు 5.5, మే నెలలో కూడా సాధారణం కంటే 106.4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దేశంలో 36 వాతావరణ ఉప విభాగాలుండగా 33 విభాగాల్లో సాధారణ వర్షపాతం నమోదు చేసుకోవడం మంచి విషయం. బీహార్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లో మాత్రమే లోటు కనిపించింది. సకాలంలో, సమానంగా కురిసిన వర్షాలు ఖరీఫ్‌లో అధిక విత్తనాలను నాటడానికి దోవాదపడ్డాయి. మే నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదు కావడం, జూన్‌లో వర్షాలు కొనసాగడంతో వ్యవసాయం ముందస్తుగా ప్రారంభమైంది. దేశంలో వరి గతేడాది 390.80 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉంటే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 7.6శాతం అంటే 420.4 లక్షల హెక్టార్లకు పెరగ్గా, మొక్కజొన్న సాగు 83.58 లక్షల హెక్టార్ల నుంచి, 11.7శాతం పెరిగి 93.3 లక్షల హెక్టార్లకు చేరుకుంది. అధిక పంట విస్తీర్ణం ముఖ్యమైన ఎరువులకు డిమాండ్‌నివ్వగా ఇది ఎరువుల అమ్మకాలనూ పెంచింది. ఈ ఏడాది జూన్, జులైలో, అదేవిధంగా గతేడాది ఇదే కాలంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సహా చాలా ఎరువుల అమ్మకాల్లో రెండంకెల వృత్తిని నమోదు చేశాయి. డిఎపి అమ్మకాల్లో పన్నెండు శాతం తగ్గుదల ఉంది. ఈ ఏడాది మంచి రుతుపవనాల సమయంలో ఎరువులు డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరా ఆ స్థాయికి చేరుకోలేదు. 2025 ఏప్రిల్- జూలైలో దేశీయ యూరియా ఉత్పత్తి గతం సంవత్సరంకంటే పడిపోయింది. మరోవైపు యూరియా, డిఏపి దిగుమతులు కూడా తగ్గాయి. ఇవి ఎరువుల కొరత సమస్యను మరింత తీవ్రతరం చేశాయి.
ఆగస్టు 1, 2025 నాటికి ఎరువుల నిల్వలు బాగా తగ్గాయని ప్రభుత్వం డేటా చూపిస్తున్నది. యూరియా నిల్వలు గతేడాది ఈ సమయంలో 86.4 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈ సీజన్‌లో 37.2 లక్షల మెట్రిక్ టన్నులకి పడిపోయాయి. ఖరీఫ్ పంటలకు గరిష్ట వినియోగం ఉన్న జులై, ఆగస్టు నెలల్లో సరఫరా కొరత తీవ్రంగా ఉంది. యూరియా సంచులు పొందటానికి రైతులు గంటల తరబడి క్యూలో నిల బడుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది.కీలకమైన విత్తనాల కాలంలో వాస్తవ కొరతను పెంచుతుందని కేంద్రం గమనించకపోవడం లోపం.ఈ ఖరీఫ్‌లో ఎరువులు డిమాండ్‌ను తక్కువగా అంచనా వేయడం వల్ల వచ్చిన సమస్యనే. ముఖ్యంగా నత్రజని అధికంగా ఉండే యూరియా వరి, మొక్కజొన్న పంటలకు ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రెండు పంటల సాగు విస్తీర్ణం పెరిగి దీనికి విరుద్ధంగా తక్కువ యూరియా అవసరమయ్యే సోయాబీన్, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గుదల యూరియా డిమాండ్‌ను మరింత తీవ్రతరం చేసింది. దేశవ్యాప్తంగా ఎరువులు సకాలంలో, తగినంత సరఫరా చేసే కీలకమైన బాధ్యత ఎరువుల శాఖకు అప్పగించబడింది. ప్రతి పంట సీజన్ ప్రారంభానికి ముందు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ రాష్ట్రాల వారీగా ఎరువుల అవసరాలను అంచనా వేస్తుంది.
ఈ అంచనాల ఆధారంగా ఎరువుల శాఖ నెలవారి రాష్ట్రాలు, కంపెనీల వారిగా సరఫరా ప్రణాళికను జారీచేస్తుంది. యూరియా వినియోగం 2013-14లో 227.5 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2024-25లో 306.67 లక్షల మెట్రిక్ టన్నులకు బలమైన పెరుగుదలను చూపుతుంది. ఇది 36శాతం వృత్తి అదేవిధంగా డిఏపి, ఎన్‌పీకేఎస్ ఎరువుల ఉత్పత్తి అదే కాలంలో 110.09 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 158.7 8 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది 44శాతం వృద్ధి. యూరియా విషయంలో భారత దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధా రపడి ఉంది. మొత్తం 310 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్‌లో 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకుంటున్నది. భౌగోళిక రాజకీయ పరిస్థితి ఎరువుల సరఫరాను ప్రభావితం చేసింది. కొనసాగుతున్న ఎర్రసముద్రం సంక్షోభం దేశానికి సరఫరాలో అంతరాయాన్ని కలిగించింది. రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాలు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలను పెంచాయి.
ఎరువుల మంత్రిత్వ శాఖ పేర్కొన్న ప్రభుత్వ డేటా ప్రకారం జూన్ నెలలో సగటు యూరియా టన్నుకు 395 డాలర్ల గత సంవత్సరంతో పోలిస్తే 15శాతం ఎక్కువ, 2024 మే నెలలో 343 డాలర్లు. ప్రపంచ మార్కెట్‌లో యూరియా ధర మధ్యప్రాచ్యంలో భారతదేశం చివరి కాంట్రాక్ట్ 530 డాలర్లు టన్నుకు, ఆగస్టు 28 గురువారం మిడిల్ ఈస్ట్ ప్రస్తుతం ధర 506.25 డాలర్లు. సరుకు రవాణాతోపాటు బీమా ఖర్చు అదనంగా టన్నుకు 30 డాలర్లు. పెరుగుతున్న ధరలు, సబ్సిడీ భారం నుంచి తప్పుకునేందుకు కేంద్రం ఎరువుల దిగుమతిపై అంత శ్రద్ధ చూపలేదని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నానో యూరియా వైపు రైతులను మరలించే ప్రయత్నం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రతరం చేశాయి. కానీ రైతులు తాము దశాబ్దాలుగా వినియోగిస్తున్న యూరియా కోసం ప్రభుత్వాలపై నిరసనకి దిగారు. 2024-25లో భారతదేశ దేశీయ యూరియా ఉత్పత్తి 30.7 మిలియన్ టన్నులు,దిగుమతి 5.6 మిలియన్ టన్నులు గత సంవత్సరం నుండి మంచి క్యారీ ఫార్వర్డ్ స్టాక్ కారణంగా ప్రభుత్వం 38.79 మిలియన్ టన్నుల వినియోగాన్ని నిర్వహించగలిగింది.
ఆగస్టు 14 యూరియా క్లోజింగ్ స్టాక్ 2.96 మిలియన్ టన్నులు. గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 61శాతం తక్కువ. ఏప్రిల్, జూన్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది దిగుమతులు12.7 శాతం తగ్గటం, దేశీయ ఉత్పత్తి 10.2 శాతం తగ్గటం మరోవైపు డిమాండ్ పెరగటం వల్ల రైతులకు అవసరమైన యూరియా సకాలంలో సరఫరా చేయలేక అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతటా దిగుమతి పరిమాణాన్ని విస్తరించడం బదులుగా ప్రభుత్వం ఆగస్టు మొదటివారంలో రెండు మిలియన్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.అలాగే సెప్టెంబర్ నాలుగు నాటికి మరో రెండు మిలియన్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యజమాన్యంలోనే నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) ఆగస్టు 16న తూర్పు పశ్చిమతీరాల్లోని ఓడరేవుల్లో ఒక మిలియన్ టన్నులు యూరియా డెలివరీ తీసుకోవటానికి టెండర్ పిలిచింది. ఎరువులు సకాలంలో అందించాలని దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం, ఎరువుల శాఖ ఇప్పుడు చైనా, మొరాకో, సౌదీ అరేబియా దేశాలతో చర్చలు జరిపి దిగుమతి ఒప్పందాలు చేస్తున్నది.
దేశంలో ప్రధానంగా పదకొండు రాష్ట్రాల్లో యూరియా కొరత ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువులు ఫ్యాక్టరీ 145 పనిదినాల్లో 85రోజులు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్లాంట్ సామర్ధ్యం సంవత్సరానికి 12 లక్షల టన్నులు. కానీ రాష్ట్ర రైతాంగం అవసరాలు తీర్చలేకపోయింది. రైతులు పంట పొలాలు వదిలి యూరియా కోసం రోజుల తరబడి కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడి నిరాశతో వెనుతిరుగుతున్న పరిస్థితి నెలకొంది. కొరతను గమనించిన ప్రయివేటు కంపెనీల నిర్వాహకులు, డీలర్లు ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్‌లో ఎరువులను అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు.పైగా యూరియాతో పాటు అవసరం లేని ఎరువుల్ని ముడిపెట్టి రైతులను అప్పనంగా దోచుకుంటున్నారు. కేంద్రం ముందస్తు ప్రణాళిక చేసి ఉంటే గనుక ఎరువుల సమస్య రాకుండా ఉండేది. రైతుల పట్ల పాలకుల నిర్లక్ష్యమే ఎరువుల కొరతకు కారణం.
బొంతు రాంబాబు
9490098205