అనుకూలించని సర్పంచ్ రిజర్వేషన్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
సర్పంచ్ పదవికి పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకున్నా.. రిజర్వేషన్లు అనుకూలంగా రానివారు ఢీలా పడ్డారు. కనీసం వార్డు సభ్యుడిగా అయినా పోటీ చేసి ఉప సర్పంచ్ పదవిని దక్కించు కుందామనే ఉద్దేశంతో పలువురు ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను గతంలో వచ్చిన రిజర్వేషన్ ఆధారంగానే రిజర్వే షన్లు ఉంటాయని, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీచేసి ఓటమి పాలైన వారు వచ్చే ఎన్నికల్లో అయినా పోటీ చేద్దామని ఉత్సాహంతో ప్రజ లతో మమేకమయ్యారు. వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తూ వచ్చారు. కొత్త వ్యక్తులు సైతం సర్పంచ్ పదవికి పోటీ చేయాలని ఆసక్తి కనబర్చారు.
తీరా రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో సర్పంచ్, వార్డు పదవులకు తాజాగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీంతో పోటీ చేయాలని ఉత్సాహంతో ఉన్న వారంతా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఉప సర్పంచ్ పదవిపై కన్నేశారు.ఉపసర్పంచ్ పదవిని అయినా దక్కించుకుని రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని పలువురు ఆరాట పడుతున్నారు. మహిళలకు రిజర్వేషన్లు వచ్చిన చోట అయితే ఈ పదవిని దక్కించుకుంటే అంతా తమదే సాగుతుందనే ఉద్దేశంతో పోటీకీ సిద్ధపడుతున్నారు. గ్రామ పాలనలో ఉపసర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. నామ మాత్రపు పాత్రకే పరిమితం అయిన ఉపసర్పంచ్ పదవి 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పవర్ ఫుల్ గా మారింది.పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కూడా ఉమ్మడి చెక్ పవర్ ను కట్టబెట్టారు.ఇది ఉపసర్పంచ్ పదవిని బలోపేతం చేసింది. దీంతో తాజాగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ పదవిని దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.


