– అడ్డా కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి : వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యవసాయేతర కార్మికుల సమస్యలపైనా పోరాటం చేయనున్నట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.పద్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పెద్ద ఎత్తున వలసొస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అడ్డా కార్మికులందరికీ గుర్తింపు కార్డులివ్వాలనీ, వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పనిప్రదేశాల్లో మహిళా కూలీలపై లైంగిక వేధింపులు, శ్రమదోపిడీ పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వారికి పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. స్థిర నివాసం లేక పిల్లలు చదువులకు దూరమవుతున్నారనీ, వారికి పట్టణాల్లో అద్దెకు ఇండ్లు కూడా ఇవ్వట్లేదని ఎత్తిచూపారు. పని ప్రదేశంలో చనిపోతే ఆదుకునే వారే లేరన్నారు. ప్రతి అడ్డా కూలీకి ప్రమాద బీమా వర్తింపజేయాలనీ, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, సాంబశివ, లంకా రాఘవులు, నరసింహులు, సరోజ, నరసింహ, మల్లేష్, మోహన్, స్వరాజ్యం, స్వరూప, బంధం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయేతర కార్మికుల సమస్యలపైనా పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES