నేడు ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ రాత్రి 7.00గం||లకు
ముంబయి: టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో జరిగే టి20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారతజట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. గురువారం జరిగే ఈ సెమీస్‌లో విజేతగా నిలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్ పోరుకు అర్హత సాధించనుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. లీగ్ దశలో సునాయాస విజయాలను నమోదు చేసుకున్నా.. నిర్ణయాత్మక సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుచేసి సెమీస్ బెర్త్ సంపాదించింది. గ్రూప్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.
సూపర్-8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటికే ముంబయి చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు. ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా నెట్‌ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. బ్యాటింగ్‌లో సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం కాగా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ.. ఇలా ప్రతి ఒక్కరు ఫామ్‌లోనే ఉన్నారు. బౌలింగ్‌లో బుమ్రాకి తోడు వరుణ్ చక్రవర్తి సత్తా చాటితే టీమిండియా ఫైనల్‌కు చేరడం ఖాయం.



