– దేశంలోనే అత్యంత ఆధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్ట్
– పది పార్కింగ్ అంతస్తులు, సినిమా థియేటర్లు : పనుల ప్రగతిని పరిశీలించిన హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో పార్కింగ్ కష్టాలను తీర్చే దిశగా ఒక అద్భుతమైన ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు తుది మెరుగులు దిద్దుతోంది. ప్రపంచంలోనే అరుదుగా ఉండే పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థను హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో నిర్మించామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నాంపల్లిలో జరుగుతున్న ఈ ప్రాజెక్టు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రపంచశ్రేణి ప్రాజెక్టుగా అమల్లోకి తేవాలని చేసిన ఆదేశాల మేరకు అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో ‘నోవమ్’ సంస్థ నిర్మించినట్టు తెలిపారు. ఇది జర్మనీకి చెందిన అత్యాధునిక ‘పాలిస్’ సాంకేతికతతో పూర్తి ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ సిస్టమ్‌గా నిర్మించబడిందని అన్నారు. నాంపల్లి మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన పార్కింగ్ కాంప్లెక్సుల్లో ఒకటని, భారతదేశంలో ఇదే మొట్టమొదటిదని తెలిపారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ రెండువేల చదరపు గజాల స్థలాన్ని 50 ఏండ్ల కన్సెషన్‌కు ఇవ్వగా, ప్రాజెక్టు డెవలపర్లు డాక్టర్ హరికిషన్ రెడ్డి, భావనా రెడ్డి వారి సొంత పెట్టుబడి రూ.102 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. మొత్తం 15 అంతస్తుల్లో పది పార్కింగ్ అంతస్తులు, అయిదు వాణిజ్యపరమైన కార్యకలాపాలకు కేటాయించారని అన్నారు. చక్కటి వసతులున్న రెండు సినీ థియేటర్లు ఈ కాంప్లెక్స్‌లో ఉన్నాయన్నారు. 11వ అంతస్తులో నగర వీక్షణకు ఒక గ్యాలరీ ఉంటుందని చెప్పారు. ఈ మల్టీ పార్కింగ్ అంతస్తుల్లో మొత్తం 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేయొచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పార్కింగ్ సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం అందించడమే కాకుండా సాంకేతికత, వినియోగదారుల అనుభవం, భద్రత, సౌలభ్యం పరంగా దేశంలో ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపించబోతోందని తెలిపారు.
మల్టీ లెవెల్ పార్కింగ్‌కు తుది మెరుగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES