జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఘటన
రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫైళ్లు దగ్ధం
8 మంది ఉద్యోగులను కాపాడిన జీడిమెట్ల పోలీసులు
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఫైళ్లు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు. అదే సమయంలో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది సిబ్బంది దట్టమైన పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఫైరింజిన్‌లతో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన విలువైన సమాచారం కాలి బూడిదైంది. ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు.. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీలో రెవెన్యూ విభాగం ముఖ్యమైనది కావడంతో అగ్నిప్రమాదంపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
కుత్బుల్లాపూర్‌లో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



