నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు బస్టాండ్‌లో రద్దీ నెలకొంది. తొలి విడత పోలింగ్‌లో ఓటు వేయడానికి ఓటర్లు పట్నం నుంచి సొంత గ్రామాలకు ఉత్సహంగా తరలి వెళ్తున్నారు. సిటీలోని మహాత్మాగాంధీ, జేబీఎస్ బస్టాండ్లు, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు మార్గాల్లో పల్లె ఓటర్లతో సందడి నెలకొంది. అంతేకాకుండా ఆయా జిల్లా కేంద్రంలో స్థిరపడిన పల్లె ఓటర్ల కూడా ఓటు వేయడానికి కుటుంబసభ్యులతో ప్రయాణమవుతున్నారు. రైల్వే మార్గాల ద్వారా కూడా తమ గ్రామాలకు తరలివెళ్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని పలువురు ఓటర్లు సొంత వాహనాల్లో ప్రయాణం సాగిస్తున్నారు.
లోకల్ బాడీ పోల్స్ లో భాగంగా రేపు తెలంగాణ వ్యాప్తంగా మొదటి పోలింగ్ జరగనుంది. మంగళవారంతోనే ప్రచారం ముగిసింది. రేపు బుధవారం ఉదయం 7గంటలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ లు, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు.. పల్లెల నుంచి జీవనోపాధి కోసం పట్నం వెళ్లిన ఓటర్ల కోసం అభ్యర్థులు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఓటర్లకు ఆన్ లైన్ వేదికగా రవాణా చార్జీలు పంపి వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేశారు. మరికొందరైతే ఓటర్లు కోసం ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం తెలంగాణలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రేపు తొలి విడత పోలింగ్ జరగనుండగా.. ఈనెల 14న రెండో దశ, 17న జరిగే మూడో దఫాతో లోకల్ బాడీ పోల్స్ ముగియనున్నాయి.



