Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమొదటి స్థానం మాదే

మొదటి స్థానం మాదే

- Advertisement -

చాలా జిల్లాల్లో అధిక సర్పంచ్‌ స్థానాలను గెలిచాం : మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో నిలిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఐదు నుంచి పది శాతం సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో 50 శాతం అధికారపార్టీ, మిగిలిన 50 శాతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పారు. ఈ ఫలితాలను చూస్తుంటే అధికార కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినా అత్యధిక స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యలేదని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రజా విజయోత్సవాలు పేరుతో ప్రచారం చేశారని వివరించారు.

అయినా ఎక్కువ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరును చెరిపేస్తే కాంగ్రెస్‌ మౌనంగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డిపై సీఎం సమీక్ష చెయ్యలేదని చెప్పారు. తెలంగాణ జలవనరులపై జరుగుతున్న కుట్రలపై ఈనెల 21న కేసీఆర్‌ సమాధానం చెప్తారని వివరిస్తారు. బీఆర్‌ఎస్‌ నేత జి దేవిప్రసాద్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే అభద్రత భావానికిలోనైనట్టుగా కనిపిస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టులాంటివని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాల్లో గెలిచిందని వివరించారు. పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యహరించొద్దని కోరారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమనీ, ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -