– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రజా ప్రభుత్వం
– శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు
– ఆనందం వ్యక్తం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక సొంత ఇల్లు ఈ చిరకాల స్వప్నం సాకారం దిశగా ప్రజా ప్రభుత్వం సహకారంతో అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. లబ్దిదారులకు ఇసుక ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. మొదటి దఫాలో ఇండ్లు పూర్తి చేసుకుంటున్న వారి బ్యాంకు ఖాతాల్లో రూ. కోటికి పైగా మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నది. ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
సొంత ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరి చిరకాల స్వప్నం. ఈ కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూపకల్పన చేసింది. మొదటి విడుతలో ఇంటి స్థలాలు ఉన్న వారికి రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు దశల్లో అందజేస్తున్నది. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. 4 దశల్లో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందు తుంది. బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.
నిర్మాణాలకు ఇసుక ఉచితం…
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటులో పెట్టి ఉచితంగా అందిస్తుంది. ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి/ మున్సిపాలిటీల పరిధిలో వార్డ్ ఆఫీసర్స్ తమ తహసీల్దార్ దృష్టికి ముందస్తుగా తీసుకెళ్లాలి. ఇసుక ఉచితం.. రవాణా ఛార్జీలు నిర్మాణదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సిమెంటు, స్టీల్ ధరలు తగ్గించాలని ఆయా కంపెనీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది. దీంతో లబ్దిదారుల నిర్మాణ ఖర్చు మరింత తగ్గనుంది. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాలు, మెప్మా ద్వారా లక్ష రూపాయల రుణం అందించే ఏర్పాట్లు చేసింది.
11 మండలాల్లో మోడల్ హౌస్ లు…
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల నిర్మాణం, గదులు తదితర అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుగా జిల్లాలోని ఆయా చోట్ల మోడల్ హౌస్ లు నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది.జిల్లాలోని 11 మండలాల్లో మోడల్ నిర్మాణాలను మొదలు పెట్టారు గృహ నిర్మాణ శాఖా అధికారులు. ఆయా ఇండ్లు తుది దశకు చేరుకున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో జిల్లా ఫస్ట్
జిల్లాకు మొదటి విడుత కింద 1061 ఇండ్లు గ్రౌండింగ్ పూర్తి అయింది. వీటిలో బేస్మెట్ లెవెల్ లో 105, రూఫ్ లెవెల్ లో 31లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించు కుంటున్న లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ఎవరి ప్రమేయం లేకుండా జమ చేసింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాకు మంజూరు అయిన 7862 ఇండ్లకు గాను 7828 అలాట్మెంట్ ఆర్డర్లు లబ్దిదారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 2575 ఇండ్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 3608 ఇండ్లు, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ఫేజ్-1,2 లో కలిపి 820 ఇండ్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలిసి, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఫేజ్-1,2లో 805 ఇండ్ల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశాన్ని కరీంనగర్ లో నిర్వహించగా, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరై ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను అభినందించారు.\
పైరవీ అవసరం లేదు: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరి పైరవీ అవసరం లేదు. నాలుగు దశల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమవుతుంది. వీటి కోసం ఎవరినీ సంప్రదించవద్దు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణదారులకు పూర్తి సహకారం అందిస్తాము. ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తిచేసుకుని రానున్న దసరా దీపావళి పండుగలను నూతన గృహాలలో జరుపుకోవాలని లబ్ధిదారులను కోరుతున్నాను.