నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు భారతీయ పౌరులను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. పశ్చిమ మాలిలోని కోబ్రి పట్టణ సమీపంలో గురువారం ఈ ఘటన జరిగినట్లు అక్కడి భద్రతా వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. బాధితులు పనిచేస్తున్న కంపెనీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
వివరాల్లోకి వెళితే.. బాధితులు ఓ విద్యుదీకరణ ప్రాజెక్టులో కార్మికులుగా పనిచేస్తున్నారు. గురువారం ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు వారిని బలవంతంగా అపహరించుకుపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం, కంపెనీలో పనిచేస్తున్న మిగతా భారతీయులను ముందుజాగ్రత్త చర్యగా రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం మాలి సైనిక పాలనలో ఉంది. దేశంలో అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, నేర ముఠాల దాడులు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో భద్రతా పరిస్థితి క్షీణించింది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లకు పాల్పడటం ఇక్కడ సాధారణంగా మారిపోయింది.
ఇప్పటివరకు ఈ కిడ్నాప్‌కు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. కాగా, సెప్టెంబర్‌లో అల్-ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం… ఇద్దరు యూఏఈ, ఒక ఇరాన్ జాతీయులను కిడ్నాప్ చేసింది. చర్చల అనంతరం సుమారు 50 మిలియన్ డాలర్ల భారీ విమోచన క్రయం చెల్లించి గత వారమే వారిని విడిపించారు. ఈ నేపథ్యంలో తాజా కిడ్నాప్ కూడా డబ్బు కోసమే జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



