నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఉపా కేసులో నిందితులు దాదాపు ఐదేండ్లుగా విచారణ లేకుండా జైలులో ఉన్నారనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఆలస్యం చేయొద్దని, బెయిల్ పరిశీలన గురించి ఏదైనా చేయగలిగారో లేదో చెప్పాలని ఢిల్లీ పోలీసులను కోరింది. సామాజిక కార్యకర్తలు ఉమర్ ఖాలీద్, షార్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్ మరో ఇద్దరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై స్పందనను దాఖలు చేయడంలో విఫలమైన ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ధర్మాసనం మందలించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకణ తీర్పును సవాల్ చేస్తూ ఆరుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్‌వి అంజరియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్లకు సమాధానం ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులకు తగినంత సమయం ఇచ్చామని స్పష్టం చేసింది. కానీ సమాధానం లేదని పేర్కొంది. అయితే ఢిల్లీ పోలీసుల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు సమాధానం దాఖలు చేయడానికి రెండు వారాల సమయాన్ని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ”మేం స్పష్టం చేశాం. మీరు (ఏఎస్‌జీ) మొదటిసారి హాజరు కావచ్చు. మేం తగినంత సమయం ఇచ్చాం” అని పేర్కొంది. కనుక మంగళ లేదా బుధవారం వాదించాలని ఏఎస్‌జీకి ధర్మాసనం సూచించింది. అయితే ఈ పిటిషన్లపై సమాధానాలు దాఖలు చేసేందుకు తగినంత సమయం కావాలని పట్టుపట్టారు. దీనిపై స్పందించిన ధర్మాసనం వద్దు..కౌంటర్‌తో గురువారం వాదించాలని, పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ దీపావళికి ముందే విచారణకు కోరారని, కానీ తామే వద్దన్నామని తెలిపింది. చివరికి ఈ పిటిషన్ల విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. నిందితులు దాదాపు ఐదేండ్లు విచారణ లేకుండానే జైలులో ఉన్నారనే విషయాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబల్, అభిషేక్ మను సింఘ్విలు వాదనలు వినిపిస్తూ ఏఎస్‌జీ అభ్యర్థనను వ్యతిరేకించారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇంకా ఆలస్యం కాకూడదని సింఘ్వి స్పష్టం చేశారు.
విచారణ లేకుండా ఐదేండ్లు జైల్లోనా ?
- Advertisement -
- Advertisement -



