నవతెలంగాణ-హైదరాబాద్ : సాంకేతిక లోపంతో అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాశారు.
సాంకేతిక సమస్య కారణంగానే విమాన సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు పేర్కొన్నారు. సమస్య పరిష్కరించేలోగా మరిన్ని సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. షికాగో, డెన్వర్, న్యూఆర్క్, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఎయిర్‌పోర్ట్‌లలో విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కరించామని, సాధారణ కార్యకలాపాల పునరుద్ధరణకు తమ బృందం కృషి చేస్తుందని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఆ తర్వాత ఓ వార్తా సంస్థతో తెలిపారు.
అయితే, ఇది సైబర్ దాడి కాదని ఎయిర్‌లైన్స్ ధ్రువీకరించింది. సమస్యకు గల కచ్చితమైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. దీని కారణంగా 826 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 23 విమానాలు రద్దయ్యాయి. వీటి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. గత నెలలో అలస్కా ఎయిర్‌లైన్స్ ఇలాంటి సాంకేతిక సమస్యనే ఎదుర్కొంది. కొన్ని గంటల సేపు ఆ సంస్థ విమానాలు నిలిచిపోయాయి.