Thursday, July 24, 2025
E-PAPER
Homeకరీంనగర్'స్మార్ట్‌' సిటీలో వరద కష్టాలు..

‘స్మార్ట్‌’ సిటీలో వరద కష్టాలు..

- Advertisement -

– ఒక రాత్రి వర్షానికే జలమయమైన రహదారులు
– సుమారు గంటకుపైగా జలదిగ్బంధమైన ప్రధాన రోడ్లు
– నిరాశ్రయులైన పేదలకు సుడాచైర్మెన్‌ పరామర్శ..
ఆహారం అందజేత
– పరిస్థితిపై ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌
– ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న మాజీ మేయర్‌ సునిల్‌రావు
– అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ సిబ్బందికి కమిషనర్‌ ఆదేశాలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి స్మార్ట్‌ సిటీ కరీంనగర్‌ నగరం అతలాకుతలమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ, ఒక్క రాత్రి వర్షానికే నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు మోకాలి లోతు వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్‌, పోలీసు శాఖల సమన్వయంతో మధ్యాహ్నం వరకు వరద నీటిని దారి మళ్లించినప్పటికీ, స్మార్ట్‌ సిటీ హౌదా ఉన్న కరీంనగర్‌లో ఈ స్థాయి జలమయం కావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందులో కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలూ ఉన్నాయి.

కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు వెళ్లే రహదారి, కరీంనగర్‌ నుంచి జగిత్యాలకు వెళ్లే రహదారి పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో ఈ మార్గాల్లో వెళ్లే బస్సులు దారి మళ్లింపు ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. కలెక్టరేట్‌ ప్రాంతం, ఇందిరాచౌక్‌, మంచిర్యాల చౌరస్తా, ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఏరియా, రాంనగర్‌ ప్రాంతాల్లోని ప్రధాన దారులు మోకాలి లోతు వరద నీటితో నిండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లు కూడా నీటిలో మునిగిపోయాయి. అల్గునూర్‌ చౌరస్తాలో భారీగా వరద నీరు చేరడంతో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ వెళ్లే వాహనాలు దాదాపు గంటపాటు నిలిచిపోయాయి. అల్గునూర్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు వరద నీటిని మళ్లించిన తర్వాత కొంత సమయానికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.పలు మండలాల్లో 70మిల్లీమీటర్లపైనే వర్షం         మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కరీంనగర్‌ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఆందోళనకరంగా ఉన్నాయి. అత్యధికంగా జమ్మికుంట పట్టణ కేంద్రంలో 78.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

మానకొండూర్‌ మండలం పోచంపల్లిలో 75.8 మిల్లీమీటర్లు, కొత్తపల్లి మండలం చింతకుంటలో 66.3 మిల్లీమీటర్లు, ధర్మారంలో 64.5 మిల్లీమీటర్లు, వీణవంక మండల కేంద్రంలో 68.8 మిల్లీమీటర్లు, సైదాపూర్‌ మండలం వెంకపల్లి గ్రామంలో 68.8 మిల్లీమీటర్లు, జమ్మికుంట మండలం తనుగులలో 66.8 మిల్లీమీటర్లు, మానకొండూర్‌ మండలం గంగిపెల్లిలో 64.8 మిల్లీమీటర్లు, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో 62.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మిగిలిన చాలా ప్రాంతాల్లో కనీసంగా 20మిల్లీమీటర్ల నుంచి 45మిల్లీమీటర్ల వర్షం కురిసింది.నిరాశ్రయులైన పేదలకు సుడాచైర్మెన్‌ ఉదారం..        గీతాభవన్‌ చౌరస్తాకు కొద్ది దూరంలో గుడారాలు వేసుకుని 30 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న సుమారు 10 కుటుంబాలు వర్షం ధాటికి తీవ్రంగా నష్టపోయాయి. గుడిసెలు, చిన్నచిన్న రేకుల షెడ్లలోకి వరద నీరు చేరి వంట సామాగ్రి పూర్తిగా తడిసిపోయింది. ‘మాకు ఇళ్లు లేవు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం ఎన్నోసార్లు దరఖాస్తులు ఇచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు.’ అని బాధితులు వాపోయారు. రాత్రంతా వరద నీటిలో ఉన్న వీరు మధ్యాహ్నం తర్వాత వరద నీటిని మళ్లించడంతో కొద్దిగా తేరుకున్నారు. వీరిని పరామర్శించిన సుడా చైర్మెన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి వారికి రెండు పుటలా ఆహారం పంపిణీ చేశారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ న్యూఢిల్లీ నుంచి కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లకు ఫోన్‌ చేసి భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిపై ఆరా తీశారు. అయితే, ఈ రెండు జిల్లాల పరిధిలో ఎలాంటి నష్టం సంభవించలేదని కలెక్టర్లు బండి సంజరుకి సమాధానం ఇచ్చారు.
ఆర్‌అండ్‌బీ నిర్లక్ష్యమే కారణం: మాజీ మేయర్‌ వై.సునిల్‌రావు ..

నగరంలో చిన్న వర్షానికే రోడ్లు, కాలనీలు జలమయం కావడంపై బీజేపీ నాయకుడు, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. ‘గతంలోనే నగరపాలక సంస్థ ద్వారా డ్రైనేజీ వ్యవస్థ విస్తరించినా, ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రధాన రహదారుల్లో వరద కాలువల నిర్మాణాన్ని ప్రణాళికా బద్ధంగా చేపట్టకపోవడం వల్ల చిన్న వర్షానికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,’ అని సునీల్‌ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆర్టీసీ వర్క్‌షాప్‌ సమీపం, రాంనగర్‌ చౌరస్తా, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, మంచిర్యాల చౌరస్తా, హుస్సేనీపురా టాటా హాస్పిటల్‌ ప్రాంతాల్లో కల్వర్టులు అప్రయోజనకరంగా మారడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోందని ఆయన వివరించారు.

గతంలో అనేకసార్లు సంబంధిత అధికారులకు సూచించినప్పటికీ, కల్వర్టుల మరమ్మతులు, అభివద్ధి పనుల్లో చలనం లేకపోవడాన్ని సునీల్‌ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ముఖ్యమైన ఐదు ప్రాంతాల్లో కల్వర్టుల మరమ్మతులు చేపట్టి వర్షపు నీరు సులువుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే, వరదలతో ప్రజలకు ఏవైనా ఆస్తినష్టం సంభవిస్తే, బాధితులకు తగిన నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్‌ ప్రపుల్‌ దేశారు
నగరంలో కురుస్తున్న వర్షాల పట్ల నగరపాలక సంస్థ డీఆర్‌ఎఫ్‌, టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశారు ఆదేశించారు. బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, వరద నీరు నిలిచిన పరిస్థితిని పరిశీలించి, వరద నీటిని డ్రెయినేజీల్లోకి మళ్లించే చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితి వస్తే నగరపాలక సంస్థ 9849906694 కాల్‌ సెంటర్‌ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, డ్రైనేజీల్లో సిల్ట్‌, చెత్తను తొలగించి స్ప్రే, ఫాగింగ్‌ లాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణ చర్యలపై దష్టి సారించాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -