దశలవారీ సడలింపులపై ఆలోచన
అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం
అమెరికా సుంకాల ముప్పుతో భారత్ వైఖరిలో మార్పు!
న్యూఢిల్లీ : ప్రపంచ వాణిజ్య పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, అలాగే అమెరికా నుంచి పెరిగే సుంకాల ముప్పు దృష్ట్యా చైనాతో సంబంధాల విషయంలో భారత్ విధానంలో మార్పు కనిపిస్తున్నది. చైనాతో ఆర్థిక సంబంధాల్లో భారత్ దశలవారీగా సడలింపులు ఇవ్వాలా అనే అంశాన్ని కేంద్రం అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తోంది. చైనా నుంచి సమాన స్థాయి సహకారం లభిస్తే ఈ సడలింపులు అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద మార్పులు కాకుండా.. దశలవారీగా నిర్ణయాలు తీసుకునే విధానమే ప్రస్తుతం చర్చలో ఉన్నది.
వీసా ప్రక్రియలో సడలింపులు
ఇప్పటికే చైనా పౌరులకు సంబంధించి వ్యాపార వీసా ప్రక్రియను భారత్ కొంత సడలించింది. ఇప్పుడు అదే దారిలో చైనా పెట్టుబడులపై ఉన్న కొన్ని పరిమితులను కూడా ఎత్తివేయాలా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ”ఇది జరుగుతోంది. కానీ కొంత సమయం పడుతుంది. ఇందులో పరస్పర సహకారం తప్పనిసరి. గతంలో విమాన సర్వీసులు పునరుద్ధరించాం, వీసాలు ఇచ్చాం, నిలిచిపోయిన ప్రాజెక్టుల కోసం సాంకేతిక నిపుణులను అనుమతించాం. అలాగే ఇది కూడా క్రమంగా ముందుకు వెళ్తుంది” అని ఈ విషయం గురించి తెలిసిన ఓ అధికారి వివరించారు.
చైనా పెట్టుబడులు ముఖ్యం
నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ చైనా పెట్టుబడులపై ఉన్న ఆంక్షలను ఉపసంహరించాలని ఇప్పటికే సిఫారసు చేసింది. అలాగే 2023-24 ఆర్థిక సర్వే కూడా.. భారత్ ఎగుమతి పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు చైనా పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడింది. భారత్-అమెరికా సంబంధాలు క్రమంగా దిగజారుతున్న ప్రస్తుత తరుణంలో చైనాతో సంబంధాలను కొంత మెరుగుపర్చుకోవడం ఒక ఆచరణాత్మక విదేశాంగ, వాణిజ్య మార్గంగా భారత ప్రభుత్వం చూస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కొన్ని సరళమైన అంశాల్లో పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మాగెట్స్ వంటి రంగాల్లో చైనా ఆంక్షలు సడలిస్తే, భారత్ కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నది.
ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు
గతేడాది భారత్-చైనా మధ్య సంబంధాలను స్థిరపర్చేందుకు రెండు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో కైలాస మానసరోవర్ యాత్ర పున:ప్రారంభం, నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, జర్నలిస్టులు, థింక్‌ట్యాంక్ పరిశోధకులకు వీసాల జారీ, సరిహద్దు నదుల సమాచారం పంచుకోవడం వంటివి ఉన్నాయి.
భారత్‌కు చైనా సాంకేతిక నిపుణులు అవసరం
ఇక భారత్‌లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం కింద ఏర్పాటైన యూనిట్లను పూర్తిగా పని చేయించేందుకు చైనా సాంకేతిక నిపుణులు అవసరమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. చైనా నుంచి వచ్చిన యంత్రాలతో ప్లాంట్లు ఉన్నా, నిపుణులు లేకపోవడంతో ఉత్పత్తి ఆలస్యం అవుతున్నదని హెచ్చరించాయి. దీంతో, చైనా సాంకేతిక నిపుణులకు తాత్కాలిక వ్యాపార వీసాల అనుమతుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.
అలాగే డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ద్వారా ఈ-బిజినెస్ వీసా (ఈ-బీ-4) వ్యవస్థలో స్పాన్సర్ లెటర్లు జారీ చేసే వీలును భారత కంపెనీలకు కల్పించింది. 2019లో చైనా పౌరులకు భారత్ జారీ చేసిన వీసాలు సుమారు 2 లక్షలు కాగా.. 2024 నాటికి అవి వేలుగానే నమోదయ్యాయి. అయితే 2023లో చైనా.. భారత పౌరులకు 1.8 లక్షలకు పైగా వీసాలు జారీ చేయడం గమనార్హం. గతేడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు మాత్రమే 85 వేలకు పైగా వీసాలు ఇచ్చినట్టు ఢిల్లీలోని చైనా ఎంబసీ తెలిపింది.



