కొత్త బావుల వేలంలో పాల్గొనండి : సింగరేణికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి సంస్థ సుస్థిర మనుగడ కోసం తక్షణమే బొగ్గు ధరల తగ్గింపు, నాణ్యతపై దృష్టి పెట్టాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలం మనుగడ సాధించాలంటే కొత్త బ్లాకులు సాధించడానికి చొరవ చూపాలని సూచించారు. అదే సందర్భంలో కార్మిక సంక్షేమంలో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో బొగ్గు రంగంలో కేంద్రం కొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నదనీ, ఇకపై ప్రభుత్వ సంస్థలు పూర్తి అంకితభావంతో పనిచేస్తే తప్ప వాటిని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. బొగ్గు నాణ్యత ప్రమాణాల పెంపునకు వాషరీలు, డ్రై వాషరీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
సంస్థ భవిష్యత్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంస్థ చైర్మెన్ ఎన్.బలరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలను ఈ సందర్భంగా వివరించారు. అంశాల వారీగా పలు సమస్యలపై మంత్రి కిషన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు చర్చించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్‌దేవ్ దత్త్, తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.కె. కస్సి, వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ పంకజ్ జైన్, సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ బి.వీరారెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఎం.తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు ధరల తగ్గింపు, నాణ్యతపై దృష్టి పెట్టండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



