– సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆధునిక మార్క్సిస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి సీతారాం ఏచూరి విప్లవ పంథాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ కార్యకర్త పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అర్పించి నట్లు అవుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆయన ప్రధమ వర్ధంతి పురస్కరించుకుని బుధవారం మండల కార్యదర్శివర్గ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు అద్యక్షతన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మండల పార్టీ మండల కమిటీ, శాఖా కార్యదర్శుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడారు.
ముందుగా ఆయన సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏచూరి లాంటి వ్యక్తికి నివాళి అర్పించడం కష్టం అని అన్నారు. ఆయన మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని, సిద్దాంతం పట్ల ఎనలేని పట్టున్న మేధావి అని, ఆర్ధిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు, క్రియాశీల కార్యకర్త, అన్నింటికంటే ముఖ్యంగా మార్క్సిజం ఆచరణ వాది అని కొనియాడారు. భారతీయ బహుళత్వమంటే ఆయన కు తెగ మక్కువ అని, దాన్ని కాపాడడానికి ఆయన నిరంతరం కృషి చేసారని అన్నారు.
జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం లోపించి ప్రజలు రోగాలు బారిన పడుతున్నారని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరి లో ఇందిరమ్మ కమిటీలు పక్షపాత కనబరిచి కాంగ్రెస్ కార్యకర్తలకు, వారి అనుయాయులకు ఇచ్చుకున్నారు అని అన్నారు. పల్లెల్లో అర్హులను గుర్తించి వారిని సమీకరించి పోరుబాట పట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. కనీసం త్రాగు నీరు సైతం సరఫరా చేయడానికి సైతం పంచాయితీల్లో నిధుల్లేవని అధికారులు చెప్పడం బాధాకరం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు మడకం గోవిందు, తగరం నిర్మల, మండల కమిటీ సభ్యులు అప్పారావు,నాగేశ్వరరావు, దుర్గారావులు పాల్గొన్నారు.