రావాలనిపించినపుడల్లా నేస్తులు వచ్చేవాళ్ళు
కొన్నిసార్లు నేను తలుచుకున్నట్టే
కొన్నిసార్లు నేను ఎదురుచూడకుండనే
వాళ్ళు పోతుంటే వీడ్కోలుపలేని చేతులకు దుఃఖమే
మాటలకు వెక్కిళ్ళే
మనసు ఎక్కడో కూలిపోయిన పచ్చిరెక్కల పిట్ట
వచ్చేదాక బాగానే వుంటది,
మనసుపడేదాక బాగానే వుంటది
మనసుతిరుగకపోవుడే బాధ
మతిలకొచ్చినపుడల్లా మనిషి వచ్చునా
మనిషి వచ్చిపోయేలోపట చచ్చిపోతది పిడాత గుండె
రాతంపడ్డ తొవ్వనిండా పొక్కిలిచేసిన రాతలసాళ్ళు
అనుకో గిదే కవిత్వమనో,
తుపాకీ నిశానీ అనో…అనుకో
కాడమల్లెచెట్టు కింద మొన్నటిదాక పువ్వులు
నిన్న జెండాలెత్తివచ్చిన మోదుగులు
రేపటికి నా యాత్రలో రాలవచ్చు,
వాతావరణశాఖకు తెలవకపోవచ్చు
నేను నదిఒడ్డునో గుట్ట అంచునో,
ఊరిబయట దుక్కులనో
గాలాడని ఆకుపచ్చఅంగీనై పడివుండొచ్చు
ఒకమాట చెప్పాలనిపిస్తున్నది
ప్రేమించు ప్రాణం పోయేదాక ప్రేమిస్తనే వుండు…
శ్రీరామోజు హరగోపాల్, 9949498698



