Saturday, March 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్వదేశీ నినాదం మరిచి విదేశీ జపం!

స్వదేశీ నినాదం మరిచి విదేశీ జపం!

- Advertisement -

దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన స్వదేశీ ఉత్పత్తులను, ముఖ్యంగా డెబ్బయి శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతుల ప్రయోజనాలను, మన స్వయంప్రాతిపత్తిని ఇంతలా బలిపెట్టడానికి ఎవరి ఆర్థిక ప్రయోజనాలు కారణమై ఉంటాయి? కార్పొరేట్‌ కంపెనీలవా? లేక పూర్తిగా కార్పొరేటీకరణ చెంది ట్రంపునకు సాగిలపడిన మోడీ ప్రభుత్వానిదా? అనేది నేడు రైతుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న? భారత్‌, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం దేశంలో కోట్లాదిమంది రైతుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ అమెరికాకు తాకట్టు పెట్టింది. ఈ ట్రేడ్‌ డీల్‌ గురించి చెప్పుకోవాలంటే ముందుగా మన దేశ చరిత్రలో ఒక బలమైన ఒక చిన్న దేశము, ఒక బలహీనమైన ఒక పెద్దదేశాన్ని, దేశాలను ఎలా లొంగదీసుకుందనేదాని గురించి చెప్పుకోవాలి. ప్రపంచంలోని చాలా దేశాలు అప్పటి ఇంగ్లాండు నియంతృత్వంలో బతికిన దేశాలే.

మనకు స్వాతంత్య్రం రాక ముందు వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ, వ్యాపారం కోసం మెల్లగా మన దేశంలోకి చొరపడింది. తన ఉత్పత్తులను, వస్తువులను అతి చౌకగా మన దేశ ప్రజలకు అమ్ముకోవడానికి అనుమతి పొందింది. ఆ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారతదేశాన్ని తన తుపాకీ, ఆయుధాల బలంతో ఆక్రమించుకుంది. అలా 200 సంవత్సరాలకు పైగా బానిస దేశంగా మార్చింది. ఆ రోజుల్లో కూడా వ్యాపార ఒప్పందాలు అనేవి ఇంగ్లాండ్‌లో నిర్ణయించేవారు. అవి అంతర్గతంగా, అనేక కుట్రలతో జరిగేవి. రైతులకు, ఉత్పత్తిదారులకు, ప్రజలకు తెలిసేవి కావు. అమెరికా, భారత్‌ల ”ట్రేడ్‌ డీల్‌” తీరు గతచరిత్రను అచ్చుగుద్దినట్టు ఉందనడంలో సందేహం లేదు.

ట్రంపు కొన్ని బలహీనమైన దేశాలను తన గుప్పెట్లో పెట్టుకొని తాను ఏం చెప్తే అది పాటించాలి, లేదంటే ఏదోరకంగా భయపెట్టి లొంగదీసుకుని, తాను అనుకున్నది సాధించే వరకు వేటాడి వెంటాడే అవలక్షణాలు కలిగిన ”ఈ కాలపు హిట్లర్‌”! అలాంటి ట్రంపునకు మన దేశ గతకాలపు బలహీనమైన రాజు లాగా మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ మోడీ, రాహుల్‌ గాంధీ అన్నట్లు, ట్రంప్‌ ఏం చెప్తే దానికి తల ఊపే ”సరెండర్‌ మోడీగా” వ్యవహరిస్తున్నాడు. అనేది కళ్లకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ వస్తువు కొనాలి, ఏ వస్తువు అమ్మాలి? దాని రేటు, దాని సుంకాలు ఎంత ఉండాలి, ఎంత దిగుమతి, ఎగుమతి చేసుకోవాలి అనేది ముందే నిర్ణయించుకున్న తర్వాతనే, బలవంతంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్‌ దండయాత్రకు దిగాడు. భారతీయులు ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి? అనేది భవిష్యత్తులో అతనే నిర్ణయించేలా ఉన్నాడు!

ట్రంపు అమెరికా కంపెనీలకు, అమెరికా రైతులకు సరైన గిట్టుబాటు ధర కనిపిస్తూ, 50శాతం సబ్సిడీలిస్తున్నాడు. వందకు వెయ్యి శాతం వారి రైతుల, కంపెనీల ప్రయోజనాల కోసం మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకుంటే మోడీ మాత్రం భారతీయ రైతులకు, ఉత్పత్తిదారులకు ఉరితాళ్లు బిగించేలాగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఏ రకంగా చూసినా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమే. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా తామేదో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినట్టు, దీంతో ఘోరంగా పడిపోయిన రూపాయి విలువను పెంచినట్టు సంకలు గుద్దుకోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది! అసలు ఈ ట్రేడ్‌ డీల్‌ గురించి వ్యవసాయమంత్రికి, విదేశాంగమంత్రికి, కామర్స్‌ మంత్రికిగాని, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీకి గాని స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ ట్రేడ్‌ డీల్‌ విషయంలో వీళ్లు చేసే ప్రకటనలకు, అమెరికా చేసే ప్రకటనలకు పొంతన ఉండటం లేదు.

రెండు దేశాల మధ్య జరిగే అతి కీలకమైన వాణిజ్య ఒప్పందం ఇంత గందరగోళంలో ఉంటుందా అనే సందేహం? యావత్‌ దేశాన్ని, మేధావులను రైతులను కార్మికులను ఆందోళనకు గురిచేస్తుంది. రెండు దేశాలు కలిసి ఒక స్పష్టమైన, పారదర్శకమైన ప్రకటన చేయాల్సిన విషయాన్ని కేవలం ట్రంపు లేదా అమెరికా శ్వేత సౌధం నుంచి మాత్రమే ప్రకటనలు ఏకపక్షంగా ఎలా పడితే అలా వస్తున్నాయి. అంటే ఆ ఒప్పందంలో ఏ విషయం ఉండాలి, ఏ విషయం ఉండకూడదు అనేది కూడా భారతదేశ నిర్ణయాలతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి.అంటే మన దేశ సార్వభౌమ స్థాయిని మోడీ ఎక్కడి వరకు దిగజార్చాడు అనేది అర్థం చేసుకోవచ్చు. అమెరికాతో మద్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశానికి ఏదో అద్భుతం జరుగుతుందనుకోవడం పొరపాటు. ఇప్పటికిప్పుడే 500 బిలియన్‌ డాలర్లు సాధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రథమస్థానంలోకి వెళ్తున్నట్లు, దేశంలో పేదరికం, నిరుద్యోగము, ఆకలితో అలమటించే ప్రజలు ఇకనుంచి ఉండరూ అన్నట్లు బీజేపీ నాయకత్వం ప్రవర్తిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది.

భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ వల్ల 50 శాతం గా ఉన్న అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించామంటూ సంబరాలు చేసుకుంటున్న బీజేపీి ప్రభుత్వానికి తెలియాల్సిన విషయం ఏమిటంటే ట్రంపు రాకముందుకు మన దేశానికి అమెరికా సుంకాలు 2.5శాతం నుంచి 3 శాతంగా ఉండేవి, ట్రంప్‌ వచ్చిన తర్వాత 25 శాతానికి పెంచింది. మళ్లీ రష్యా నుంచి చమురు కొంటున్నారనే కోపంతో మరో 25శాతం కలిపి మొత్తం 50శాతం సుంకాలు విధించింది. దాన్నిప్పుడు 18 శాతానికి తగ్గించిన ట్రంపును మోడీ, వారి పరివారం పొగుడుతూ మిగతా ఇతర దేశాలకంటే మన పైన విధించిన సుంకాలు చాలా తక్కువ అంటూ గొప్పలు చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. వాస్తవానికి అమెరికా సుంకాలు 2.5 నుంచి 18 శాతానికి పెరగడం వల్ల అదనంగా 15.5శాతం అదనపు సుంకాలను మనం భరించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది మనం ఎగుమతి చేసే వస్తువులకు 18శాతం సుంకాలు అమెరికా విధిస్తుంటే, మనం మాత్రం అమెరికా వస్తువులకు సున్నా సుంకాలను పాటిస్తున్నాము.

అమెరికా సుప్రీంకోర్టు చెప్పిన ట్రంప్‌ వెనక్కి తగ్గడం లేదు. తను అనుకున్నదే తాను చెప్పిందే శాసనమన్నట్లు మళ్లీ కొత్తగా 15శాతం సుంకాలు వర్తిస్తాయి అంటున్నాడు. సోలార్‌ పైన కూడా 125శాతానికి పైగా సుంకాలు విధిస్తున్నారు. ఇక్కడ ఎవరు నష్టపోయినట్టు? ఎవరు లబ్ధి పొందినట్లు? ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ రైతంగం ప్రధానంగా నష్టపోతూ తమ జీవనాధారాన్ని కోల్పోయినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే, భారతీయ రైతులు పండించిన పంటలు గాని, ఉత్పత్తులను గాని సరైన రేటుకు మన దేశంలోనే అమ్ముకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిని మోడీ ప్రభుత్వం కల్పిస్తోంది. అమెరికా రైతులు పండించిన ఆహార పంటలకు, వ్యవసాయ ఉత్పత్తులకు, వస్తువులకు ఎలాంటి సుంకాలు లేకపోవడం వల్ల మన దేశంలోకి విచ్చలవిడిగా ప్రవేశించి అతి చౌకధరలకు అమ్ముతుంటే, ఎవరైనా తక్కువ ధరకు అమ్మేవారి వద్దనే వస్తువులను, ఉత్పత్తులను కొంటారు.

అప్పుడు మన వ్యవసాయంలో నష్టాలు ఏర్పడి రైతులు దాన్నుంచి తప్పుకుంటే వారి వ్యక్తిగత ఆర్థిక భద్రతతో పాటు దేశ ఆర్థిక భద్రత కూడా బలహీనపడుతుంది. చివరికి ఉపాధి లేక ఆకలితో ఆలమటించేది రైతులొక్కరేకాదు, యావత్‌ భారత ప్రజలు. అన్నం పెట్టే రైతుకు ఇలాంటి పరిస్థితి వస్తే మనదేశం ఆకలితో అలమటించే మరో ఆఫ్రికన్‌ దేశం లాగా తయారవుతుంది. దీన్ని బీజేపీ ప్రభుత్వం గమనించడం లేదా? గమనించినా పట్టించుకోవడం లేదా? ఇదేనా మోడీ ప్రభుత్వ మేకిన్‌ ఇండియా, స్వదేశీ ఉత్పత్తుల నినాదం? మోడీ ప్రతిసారీ పార్లమెంటులో, స్వాతంత్య్ర వేడుకల్లో, బహిరంగ సభల్లో గట్టిగా బల్లచరుస్తూ గ్రామీణ స్థాయిలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, విదేశీ ఉత్పత్తులను వాడొద్దంటూ చెబుతుంటాడు. మరి ఇప్పుడు ”స్వదేశీ నినాదం మరిచి విదేశీ జపం” చేస్తున్నాడు. అందుకే ఈ ట్రేడ్‌డిల్‌ వల్ల అమెరికా వికసిస్తుంది, కానీ భారత్‌ కాదు.

డాక్టర్‌ మండ్ల రవి
9177706626

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -