Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందున్నపోతుకు వినతిపత్రమిచ్చి మాజీ సర్పంచుల నిరసన

దున్నపోతుకు వినతిపత్రమిచ్చి మాజీ సర్పంచుల నిరసన

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సార్యం చేస్తున్నదని నిరసిస్తూ తెలంగాణ సర్పంచుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు మంగళవారం హైదరాబాద్‌లో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్‌ మాట్లాడుతూ..మానవ హక్కుల కమిషన్‌ ముందు హాజరయ్యేందుకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మరో నెల గడువు కోరడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా దున్నపోతు మీద వర్షం పడ్డా స్పందించని చందంగా రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేసి గ్రామపంచాయతీల్లో అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పోతే కాంగ్రెస్‌ సర్కారు పతనం కావడం ఖాయమని హెచ్చరించారు.

జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి బి.మల్లయ్య, మేడబోయిన గణేశ్‌ మాట్లాడుతూ..పెండింగ్‌ బిల్లులో తక్షణమే చెల్లించి స్టేట్‌ ఫైనాన్స్‌ నుంచి ఇప్పటివరకు ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తప్పుడు ప్రకటనలతో మాజీ సర్పంచుల ప్రాణాలతో చెలిగాటమాడుతున్న ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అతి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. సంగారెడ్డి జిల్లా అరవింద్‌రెడ్డి, వరంగల్‌ జిల్లా నెక్కొండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మాదాసు రవి నిర్మల్‌ జిల్లా పూర్ణ చందర్‌ గౌడ్‌, సముద్రాల రమేష్‌, వికారాబాద్‌ జిల్లా సర్పంచులు పి పాండు రంగారెడ్డి, వెంకట్రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కందుకూరు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -