నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘేని అరెస్టు చేశారు. సీఐడీ ఆయన్ను అదపులోకి తీసుకున్నది. స్థానిక ఛానల్ అదా డెరనా ఈ వార్తను రిపోర్ట్ చేసింది. ఓ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు సీఐడీ ఆఫీసుకు వెళ్లిన ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో విక్రమ్‌సింఘేను ప్రశ్నిస్తున్నారు.
విక్రమసింఘేను కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు అధికారి తెలిపారు. వ్యక్తిగత కారణాల కోసం ప్రభుత్వ నిధులను వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. సెప్టెంబర్ 2023లో ఆయన లండన్ పర్యటనకు వెళ్లారు. ఆ అంశానికి సంబంధించిన కేసులో విక్రమసింఘేను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్ యూనివర్సిటీలో విక్రమసింఘే భార్యను సత్కరించే కార్యక్రమం కోసం ఆయన వెళ్లారు.