Sunday, December 14, 2025
E-PAPER
Homeజోష్ఫార్చ్యూనర్‌ దాబా

ఫార్చ్యూనర్‌ దాబా

- Advertisement -

భారతదేశంలో యువత ఆలోచనలు మారుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత భవిష్యత్‌ కోసం ఉద్యోగం కంటే వ్యాపారమే మిన్న అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎవరూ ట్రై చేయని కొత్త వ్యాపారం కోసం చాలా మంది వెతుకుతూ ఉన్నారు. హౌటళ్లు, రెస్టారంట్లు ఆహార బిల్లులలో సర్వీస్‌ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంతో యువత ఎక్కువగా దాబాలు, స్రీట్‌ ఫుడ్‌ వైపు మరులుతున్నారు. ఇటీవల మొబైల్‌ క్యాంటీన్ల క్రేజ్‌ పెరిగిపోయింది.

ప్రస్తుతం రహదారుల గుండా మొబైల్‌ క్యాంటీన్‌ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న వారు అధికం. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఈ మొబైల్‌ క్యాంటీన్‌ లు విశిష్టమైన సేవలు అందిస్తున్నాయనే చెప్పవచ్చు. రహదారిలో ఉన్న మొబైల్‌ క్యాంటీన్లు ప్రస్తుతం అధిక ఆదరణ పొందుతున్నాయి. అయితే అందరూ పెట్టి వెరైటీలే ఉంటే మన దగ్గరకు ఎవరు వస్తారు? ఏదైనా వినూత్నంగా ఉండాలనే ఆలోచనలు చేస్తున్నారు. యువకులు ఎక్కువగా బిజినెస్‌పై దష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే తమ వాహనాల్లో రోడ్ల వెంట రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకుని సంపాదిస్తున్నారు. ప్రస్తుతం రోడ్లలో అనేక తాత్కాలిక రెస్టారెంట్లు ఉన్నాయి.

రోడ్లపై మనం చాలా రెస్టారెంట్లను చూశాం. అయితే ఇక్కడ టయోటా ఫార్చ్యూనర్‌లో సెట్‌ చేసిన రెస్టారెంట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా నిలిచింది. వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన ఫార్చ్యూనర్‌లో చిన్న హౌటల్‌ సెటప్‌ని చేశాడు. కారు యొక్క రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా మోడల్‌ను సరిగ్గా తెలియకపోయినా ఫార్చ్యూనర్‌లో ఇలా హౌటల్‌ సెటప్‌ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టయోటా ఫార్య్చూనర్‌లో ఓ వ్యక్తి రెస్టారెంట్‌ నడిపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
ఫార్చ్యూనర్‌ బూట్‌లో ఆహారాన్ని నింపిన బాక్స్‌లతో రోడ్డు పక్కన ఆపి సేల్‌ చేస్తున్నాడు. ఇందులో కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా వివిధ వంటలు ఉన్నాయి. ఈ ఫార్చ్యూనర్‌ రెస్టారెంట్‌ లొకేషన్‌ పంజాబ్‌లో ఉంది. 10 ఏళ్లు పైబడిన డీజిల్‌ వాహనాల నిషేధం, 15 ఏండ్ల పెట్రోల్‌ వాహనాల నిషేధం కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ ప్రజలు తమ సొంత వాహనాలను ఇలా రెస్టారెంట్లు ఇక మిగతా బిజినెస్‌లో కోసం వాడుకుంటున్నారు.



ఢిల్లీలో రిజిస్ట్రేషన్‌ అయినప్పటి నుండి ఈ సమయాలను దాటిన వాహనాలు ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో తిరిగి రెన్యూవల్‌కి అవకాశం ఉండదు. ఢిల్లీ ప్రజల కార్లను పొరుగు రాష్ట్రాల ప్రజలు మంచి ధరకు దక్కించుకుంటున్నారు. అయితే ఈ ఫార్చ్యూనర్‌ కూడా సేమ్‌ అలాంటి కోవకే చెందినదిగా వీడియో చూస్తే అర్థం అవుతుంది. రోడ్లపై పనిచేసే ఇలాంటి కార్‌ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. అటువంటి ప్రదేశాలు ప్రభుత్వ తనిఖీల ద్వారా వెళ్లవు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి, మీరు వీటిని తరచుగా రోడ్ల వెంట చూడవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది సరసమైన మార్గం. అయితే, అలాంటి ఆహారాల పరిశుభ్రతకు ముఖ్య ప్రాధాన్యతను ఇవ్వాలి.

ఇదే కోవలో హర్సిమ్రాన్‌ సింగ్‌ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో తన సరికొత్త కియా కేరెన్స్‌ ఎంపీవీ బూట్‌ స్వేస్‌లో ఆహారాన్ని విక్రయించిన వీడియో హైలట్‌ అయ్యింది. వీడియోలో, వ్లాగర్‌ తన కారు వెనుక నుండి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని విక్రయిస్తున్న వ్యక్తితో సంభాషణ చేశాడు. తాను విక్రయించిన ఆహారమంతా తన భార్యే తయారు చేసిందని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే ఈ రెస్టారెంట్‌ కారు ఎక్కడ ఉందనేది వీడియోలో పేర్కొనలేదు. వీడియోలో ఉన్న కియా కేరెన్స్‌ కొత్త కారు కావడం గమన్షార్హం. కారు యజమాని క్యారెన్స్‌లోని మూడవ వరుస సీట్లను మడిచి, తన కారు వెనుక నుండి కస్టమర్‌లకు ఆహారాన్ని విక్రయిస్తున్నాడు. ఇలాంటి సంఘటనే ఒకటి ఈ సంవత్సరం ప్రారంభంలో వైరల్‌ అయింది.

ఢిల్లీకి చెందిన తాప్సీ ఉపాధ్యారు రూటే సపరేటు. 21 ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి బీటెక్‌ చదివినా ప్రజలకు హొఆరోగ్యకరమైన, రుచికరమైన స్ట్రీట్‌ ఫుడ్‌ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వినూత్న ఆలోచనతో తాను అందుకున్న పట్టా పేరుతోనే ‘బీటెక్‌ పానీపూరీ వాలీ’గా అవతారమెత్తింది. సొంతంగా ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసి ఢిల్లీ నగర వీధుల్లో బుల్లెట్‌ బండిపై ధైర్యంగా తిరుగుతూ తన వత్తిపట్ల నిబద్ధతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తోంది.
తనను తాను పరిచయం చేసుకుంటూ వయస్సుతో సంబంధం లేకుండా తన నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకుంది. శుద్ధి చేసిన పిండి లేకుండా చేసిన పానీ పూరీలతో ప్రత్యేకమైన కలను ప్రదర్శించింది. పానీ పూరీలలో వాడే ఫ్లేవర్‌ఫుల్‌ వాటర్‌ను మట్టి కుండల్లో మసాలాలు వేయించి పూర్తిగా తన చేతులతోనే తయారుచేశారని తాప్సీ వివరించింది. అదనంగా, ఆమె తన ఇంట్లో తయారుచేసిన చింతపండు, బెల్లం తీపి చట్నీని కూడా వీడియోలో ఎలా తయారు చేసిందో వివరించింది.
ఇలా ఎవరికీ నచ్చినట్లు వారు తమ అభిరుచికి తగినట్లుగా ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేసుకుంటూ రాణిస్తున్నారు. కొంత మంది మొదట్లో కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నప్పటికీ చాలా వరకు నిలదొక్కుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖరీదైన కార్లు, వాహనాలల్లో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు ఎందరో యువతకు స్పూర్తినిస్తాయని కొందరు పెద్దలు భావిస్తున్నారు.

– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -