గత అభివృద్ధిని ఆదరించిన ప్రజలకు అండగా నిలబడతా
ప్రతిపక్ష పార్టీగా నాలుగు సర్పంచు స్థానాలు సాధించడం ప్రజల ఆశీర్వాదం
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ – నపర్తి
మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేము బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా గణపురం మండలంలోని నాలుగు గ్రామపంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తమ పార్టీకి అండగా నిలిచిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజల సమస్యల పట్ల స్పందించామని ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీయే మాకు అండ అని నమ్మి నలుగురు సర్పంచులను ఏకగ్రీవం చేశారని తెలిపారు.
ఇదే ఉత్సాహముతో పార్టీ శ్రేణులు కష్టపడి పని చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, గత ప్రభుత్వ పథకాలను ప్రజలకు గుర్తు చేసి ప్రజల అభిమానాన్ని సంపాదించి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని పిలుపునిచ్చారు. మొదటి దశ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఖిల్లా ఘనపురం మండలం కర్నే తండాకు చెందిన కడావత్ కృష్ణ నాయక్ భార్య కూడా శాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు.
ఈ గ్రామపంచాయతీలో సర్పంచును ఏకగ్రీవం చేయడం రెండవ సారని తెలిపారు. ఖిల్లా ఘనపురం మండలం కోతులకుంట తండా కు చెందిన మూడవ పాండు భార్య కేతావర్ చంద్రమ్మ, గోపాల్పేట మండలం ఆముదాల కుంట తండా ముదావత్ శంకర్ నాయక్ భార్య ముదావత్ కవిత, గోపాల్పేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన బంగారయ్యలు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధికి బీఆర్‌ఎస్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుని తమ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజల విశ్వాసానికి కట్టుబడి పనిచేస్తామని మరొక్కసారి ఏకగ్రీవం చేసిన గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.



