– పైలట్లకు విశ్రాంతి, నియమాకాలు లేకపోవడంపై జారీ చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ : పైలట్లకు విశ్రాంతి, అంతర్జాతీయ విమానాల్లో సిబ్బంది నియామాకాల్లో 29 ఉల్లంఘనలపై ఎయిర్ ఇండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఎయిర్‌ఇండియాకు 14 రోజుల సమయాన్ని ఇచ్చింది. ఈ నోటీసుల విషయంపై ఎయిర్‌ఇండియా గురువారం ఒక ప్రకటనలో స్పందించింది. ‘గత ఏడాది కాలంలో ఎయిర్ ఇండియా చేసిన ఉల్లంఘనలకు స్పందించి డీజీసీఏ నుంచి నోటీసులను అందుకున్నట్టు మేం అంగీకరిస్తున్నాం. ఇచ్చిన గడువులోగా ఈ నోటీసులకు ప్రతిస్పందిస్తాం. మా సిబ్బంది, ప్రయాణీకుల భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ప్రకటనలో ఎయిర్ ఇండియా తెలిపింది. పైలట్లకు శిక్షణ, సమయపాలన విషయంలో 19 ఉల్లంఘనలు గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది. 2024 జులై నుంచి 2025 జూన్ వరకూ ఇవి జరిగినట్టు తెలిపింది. అలాగే 2024 జూన్ నుంచి 2025 జూన్ మధ్య ఒక ఫస్ట్ ఆఫీసర్, ఇద్దరు కెప్టెన్లకు వారపు విశ్రాంతి విషయంలో మూడు ఉల్లంఘనలు జరిగినట్లు తెలిపింది. అలాగే, అంతర్జాతీయ విమానాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన క్యాబిన్ సిబ్బంది విషయంలో నాలుగు ఉల్లంఘనలు జరిగినట్టు డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. 2025 ఏప్రిల్ 27 నుంచి 2025 మే 2 వరకూ ఈ ఉల్లంఘనలు జరిగాయి. అదేవిధంగా క్యాబిన్ సిబ్బంది శిక్షణకు సంబంధించి మూడు ఉల్లంఘనలు జరిగినట్టు డీజీసీఏ తెలిపింది. 2024 డిసెంబరు నుంచి 2025 మే వరకూ ఈ ఉల్లంఘనలు జరిగాయి. నిబంధనలు పాటించకపోవడంపై పదేపదే హెచ్చరికలు జారీ చేసినా నిబంధనలను పాటించకపోవడంపై పర్యవేక్షణ, సిబ్బంది ప్రణాళిక, శిక్షణ పాలనకు సంబంధించిన వ్యవస్థాగత సమస్యలు పరిష్కారం కాలేదని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. సమర్థవంతమైన నియంత్రణ విధానాలను ఏర్పాటు చేయడం, అమలు చేయడంలో ఎయిర్ ఇండియా విఫలం చెందిందని డిజిసిఎ తన నోటీసుల్లో విమర్శించింది. అలాగే ఎయిర్‌ఇండియాలో పేలవమైన భద్రతా నిర్వహణపైనా డిజిసిఎ అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
ఎయిర్ ఇండియాకు నాలుగు షోకాజ్ నోటీసులు
- Advertisement -
- Advertisement -