Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం

ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం

- Advertisement -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా వేధింపులు
యూరియా బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు
హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్‌ రేట్‌
జూబ్లిహిల్స్‌లో ఉప ఎన్నికల్లో
హస్తానికి బుద్ధిచెప్పాలి : కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేసి, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్‌కు జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం వెంగళరావు నగర్‌ డివిజన్‌ స్థాయి బూత్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియాను కాంగ్రెస్‌ నేతలు బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో నేరాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా రేవంత్‌ సర్కార్‌ చేస్తున్న నిర్వాకంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఒక్క పైసా లేదంటున్న డిప్యూటీ సీఎం కమీషన్లు, కాంట్రాక్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే అంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెండింగ్‌ లో ఉంచిన రూ.3 వేల కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. కాలేజీల బంద్‌ను ఆపి వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో యూరియా తీవ్రమైన కొరతకు కాంగ్రెస్‌ కారణమని విమర్శించారు.

రైతుల కోసం కేటాయించిన యూరియాను కాంగ్రెస్‌ నేతలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారంటూ, మిర్యాలగూడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గన్‌మ్యాన్‌ యూరియా లారీ లోడ్‌ను ఎత్తుకుపోవడాన్ని ఉదహరించారు. ఇక కాంగ్రెస్‌ నాయకులు, మంత్రుల దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. గత ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కేసీఆర్‌ కొనసాగించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. అయితే కేసీఆర్‌ పేరు ఉందన్న ఏకైక కారణంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్‌ కిట్స్‌, బతుకమ్మ చీరలు, రంజాన్‌ తోఫాలు ఆపేశారని ఉదహరించారు. 24 నెలల్లో ఒక్క హామీను కూడా కాంగ్రెస్‌ అమలు చేయలేకపోయిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వాకంతో గ్రామాల్లో అత్తా, కోడళ్ల మధ్య కొత్త పంచాయితీలు మొదలయ్యాయన్నారు. హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, నేరాలు విపరీతంగా పెరిగాయని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వేళ మంత్రులు ప్రజల పరామర్శకు వెళ్లాలే తప్ప ఉప ఎన్నికల ప్రచారానికి కాదన్నారు. కేసీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలోని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని కేటీఆర్‌ తెలిపారు. గులాబీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికతోనే మొదలవ్వాలని ఆకాంక్షించారు.

ఘన విజయంతో గోపినాథ్‌కు నివాళి
జూబ్లిహిల్స్‌ ఎన్నికల్లో ఘన విజయంతో దివంగత మాగంటి గోపీనాథ్‌కు ఘన నివాళి అర్పించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే గోపీనాథ్‌ ఉన్నారని గుర్తుచేశారు. కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పీజేఆర్‌, కేసీఆర్‌ పోరాట స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పని చేయాలని కోరారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తమ ఇంటిని కూల్చివేసేందుకు పర్మిషన్‌ ఇచ్చినట్టే అన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని వారికి సూచించారు. జీవో నెంబర్‌ 58, 59 కింద లక్ష మందికి కేసీఆర్‌ పట్టాలిచ్చారని, కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వేల మంది ఇళ్లను కూలగొట్టిందని కేటీఆర్‌ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -