ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వీడియో కన్సల్టెన్సీ
జనరల్ మెడిసిన్ నుంచి కార్డియాలజీ వరకు
అందుబాటులో 20 రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు
గతేడాది 6 లక్షల మంది పేషెంట్లకు సేవలు
సత్ఫలితాలు ఇస్తున్న టెలీ మెడిసిన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏదైనా రోగమొస్తే ఉన్నదంతా అమ్ముకోవడమే అన్నట్టు ప్రయివేటు దోపిడీ పెరిగిపోయింది. ఇంకా అరుదైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అవసరమైతే ఇక చెప్పే పనే లేదు. సామాన్యులకు నిత్యం అనుభవంలోకి వస్తున్నదే. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తూనే, టెలీ మెడిసిన్ లాంటి వ్యవస్థల ద్వారా ప్రజలు ఉన్న చోటికే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను మెరుగ్గా తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో టెలీ మెడిసిన్ ద్వారా లక్షలాది మంది లబ్ది పొందుతున్నారు. మెరుగైన సలహాలు, సూచనలు అందుకుంటున్నారు. కరోనా తర్వాత టెలీ మెడిసిన్ వ్యవస్థకు ప్రాధాన్యం అమాంతం పెరిగిపోయింది. ప్రతిసారి దూర ప్రాంతాల్లో ఉండే సూపర్ స్పెషాలిటీ వైద్యుల వద్దకు వెళ్లడం రోగులకు సాధ్యపడదు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి టెలీ మెడిసిన్ దివ్యౌషధంలా కనిపిస్తున్నది. రాష్ట్రంలో 2018 నుంచి టెలీ మెడిసిన్ సేవలందుతున్నాయి. 2022 నుంచి జనరల్ మెడిసిన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. 77 స్పెషాలిటీ హబ్స్, 1,000 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, 20 స్పెషాలిటీల్లో ఉచితంగా సేవలందిస్తున్నారు. గతేడాది 6 లక్షల మందికి పైగా టెలీ మెడిసిన్ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, డెర్మటాలజీ, డయాటెటిక్స్, జనరల్ సర్జరీ, ఫిజియోథెరపీ, ఆప్తమాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రి, ఎండోక్రైనాలజీ, పల్మనరీ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, డెంటల్, యూరాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ స్పెషాలిటీల్లో సేవలందిస్తున్నారు. వీటిలో కొన్ని సేవలు వారంలో ఆరు రోజులపాటు అందుబాటులో ఉండగా, మరికొన్ని సేవలు ఎంపిక చేసిన రోజుల్లో అందుతున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి 2025 జూన్ నాటికి 2,52,36,473 మంది జనరల్ కన్సల్టేషన్స్ తీసుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 20,55,482 ఉండగా, నిర్మల్ లో అతి తక్కువగా 2,93,430 కన్సల్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు 17,68,432 స్పెషాలిస్ట్ కన్సల్టేషన్స్ పూర్తయ్యాయి. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ లో 12,022 మంది ఉపయోగించుకున్నారు. 20 స్పెషాలిటీల్లో సేవలందుతుండగా అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్‌కు 4,11,304 మంది కన్సల్టేషన్ తీసుకోగా ఆంకాలజీలో అతి తక్కువగా 1,207 కన్సల్టేషన్స్ ఉన్నాయి. టెలీ మెడిసిన్ సేవల కోసం ష్ట్ర్‌్‌జూరబీ//వఝఅjవవఙaఅఱ.ఎశీష్ట్రటష.స్త్రశీఙ.ఱఅ/లో సంప్రదించవచ్చు.
ప్రజల వద్దకే ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES